బెంగళూరు, జనవరి 24: కర్ణాటక రాజధాని బెంగళూరులో మూడు రోజుల కిందట కనిపించకుండా పోయిన 12 ఏండ్ల బాలుడిని హైదరాబాద్‌లో గుర్తించారు. సోషల్ మీడియా సాయంతో బాలుడి ఆచూకీ లభించడంతో తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. గత ఆదివారం ఉదయం 11 గంటలకు బెంగళూరులోని వైట్‌ఫీల్డ్ వద్ద కోచింగ్ సెంటర్ నుంచి బయటకు వచ్చిన పరిణవ్.. తిరిగి ఇంటికి వెళ్లకుండా, మైసూర్ నుంచి చెన్నై.. అటు నుంచి హైదరాబాద్‌కు వచ్చాడు.
బుధవారం హైదరాబాద్‌లోని నాంపల్లి మెట్రో స్టేషన్ వద్ద ఓ మహిళ పరిణవ్‌ను గుర్తించింది. ‘బెంగళూరులో మిస్సింగ్ అయ్యింది నువ్వే కదా?’ అని ఫొటో చూపి అడిగింది. అవునని పరిణవ్ సమాధానం చెప్పటంతో సమీపంలోని నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించింది. తమ పిల్లాడు హైదరాబాద్‌లో ఉన్న విషయం తెలుసుకున్న బాలుడి తల్లిదండ్రులు ఎంతగానో సంతోషించారు. బాలుడి ఆచూకీ కనుగొనడంలో సాయం అందించిన సోషల్ మీడియా యూజర్లకు కృతజ్ఞతలు తెలిపారు.