(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్‌గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేసిన వేళ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో కీలక పిటిషన్ దాఖలైంది. దోషిగా తేలిన ఎంపీ, ఎమ్మెల్యేలను ఆటోమెటిక్‌గా అనర్హులుగా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ కేరళకు చెందిన సామాజిక కార్యకర్త అభా మురళీధరన్ ధర్మాసనం ముందు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8(3) రాజ్యాంగ చెల్లుబాటును ప్రశ్నిస్తూ ఆమె శనివారం ఈ పిటిషన్ వేశారు.
స్వేచ్ఛగా విధులు నిర్వర్తించకుండా..
నియోజకవర్గ అభివృద్ధి కోసం, తమ సంక్షేమం కోసం ప్రజాప్రతినిధులను ఓటర్లు ఐదేండ్లకోసారి ఎన్నుకొంటారని పిటిషనర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే, ఎంపీ, ఎమ్మెల్యేలను ఆటోమేటిక్‌గా అనర్హులుగా ప్రకటించడంతో ఓటర్లు తమపై పెట్టిన బాధ్యత, నమ్మకాన్ని ప్రజాప్రతినిధులు స్వేచ్ఛగా నిర్వర్తించలేకపోతున్నారని అభిప్రాయపడ్డారు. ఇది రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధమని పేర్కొన్నారు. అనర్హత వేటుతో ఎన్నికల నిర్వహణ ఖర్చు, సమయం కూడా వృథా అవుతుందని అభిప్రాయపడ్డారు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8(3) కింద.. దోషిగా తేలిన ప్రజాప్రతినిధిని ఆటోమెటిక్‌గా అనర్హుడిగా ప్రకటించడం రాజ్యాంగం కల్పించిన హక్కులను ఉల్లంఘించడమేనని పిటిషన్లో అభా ఆరోపించారు. సంబంధిత సభ్యునిపై ఉన్న నేరాల స్వభావం, తీవ్రతతో సంబంధం లేకుండానే ఆయన/ఆమెపై అనర్హతను అమలు చేయడం రాజ్యాంగ సూత్రాలను
ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సబ్ సెక్షన్ (1), సెక్షన్ 8, సెక్షన్ 8ఏ, 9, 9ఏ, 10, 10ఏ, 11 ప్రకారం.. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమైన ‘ఆటోమేటిక్’ అనర్హతపై తగిన ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. రాహుల్‌పై అనర్హత వేటు పడిన మరుసటి రోజే సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ దాఖలవడం ప్రాధాన్యత సంతరించుకున్నది.