న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పాము కాటు(Snakebites) ఘటనలు ఎక్కువగా నమోదు అవుతున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. అయితే పాముకాటు మరణాలను తగ్గించే అంశంలో రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి కేంద్రం ఏదైనా చర్యలు తీసుకోవాలని ఇవాళ సుప్రీం ధర్మాసనం సూచన చేసింది. అన్ని వైద్య కేంద్రాల్లో పాముకాటుకు కావాల్సిన చికిత్స అందుబాటులో ఉండేలా చూడాలని కోర్టు చెప్పింది. జస్టిస్ బీఆర్ గవాయి, ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. పాము కాటుకు విరుగుడు అయిన యాంటీ వినోమ్ లేకపోవడం వల్ల దేశంలో ప్రజా ఆరోగ్య సంక్షోభం ఏర్పడినట్లు ఓ పిటీషన్లో పేర్కొన్నారు. ఆ పిటీషన్‌పై కోర్టులో వాదనలు జరిగాయి. పాముకాటు సంఘటనల గురించి అన్ని రాష్ట్రాలతో చర్చించాలని, దేశవ్యాప్తంగా ఈ సమస్య ఉన్నదని సుప్రీం బెంచ్ చెప్పింది. అన్ని రాష్ట్రాల ప్రతినిధులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఏదో ఒకటి చేయాలని సుప్రీం పేర్కొన్నది.
తాము తీసుకున్న అన్ని చర్యలను కౌన్సిల్ ముందు పెట్టనున్నట్లు కేంద్రం తెలిపింది. ఆరు వారాల తర్వాత తమ అభిప్రాయాలను కౌంటర్ ఫైల్ చేయనున్నట్లు కొన్ని రాష్ట్రాలు కోర్టుకు చెప్పాయి. అడ్వకేట్ శైలేంద్ర మణి త్రిపాఠి.. పాముకాటు ఘటనలపై కోర్టులో దావావేశారు. అయితే ప్రభుత్వ ఆస్పత్రులు, మెడికల్ కాలేజీల్లో పాము కాటుకు విరుగుడు మందు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆ పిటీషన్లో కోరారు. గత ఏడాది డిసెంబర్ 13వ తేదీన దీనిపై వాదనలు జరిగాయి.
భారత్‌లో అత్యధిక స్థాయిలో పాముకాటు మరణాలు సంభవిస్తున్నట్లు అడ్వకేట్ చాంద్ ఖురేషి తెలిపారు. ప్రతి ఏడాది 58 వేల మంది మరణిస్తున్నట్లు చెప్పారు. మరణాల సంఖ్య ఎక్కువగా ఉందని.. ప్రాణాలను దక్కించుకునే యాంటీ-వినోమ్ కొరత తీవ్రంగా ఉన్నట్లు ఆ పిటీషన్లో తెలిపారు.