న్యూఢిల్లీ, జనవరి 16: వచ్చే రెండు నెలల్లో దేశంలో స్మార్ట్ఫోన్లు, టెలివిజన్లు, ల్యాప్‌టాప్‌ల ధరలు 4-8 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. గత ఏడాది నవంబర్-డిసెంబర్లో 21 శాతం పెరిగిన ధరలకు అదనంగా ఈ భారం పడనున్నది. కృత్రిమ మేధ(ఏఐ), అధిక-పనితీరు గల కంప్యూటింగ్ టెక్నాలజీలను వేగంగా స్వీకరిస్తున్న దరిమిలా మెమెరీ చిప్‌లకు డిమాండు పెరగడం ఈ పెరుగుదలకు ప్రధాన కారణం. మార్కెట్ ట్రాకర్ కౌంటర్‌పాయింట్ రిసెర్చ్ ప్రకారం మెమరీ చిప్ మార్కెట్ హైపర్-బుల్ దశకు చేరుకుంది.
గత త్రైమాసికంలో 50 శాతం పెరిగిన మెమరీ చిప్‌ల ధరలు ఈ త్రైమాసికంలో మరో 40-50 శాతం పెరగవచ్చు. ఏప్రిల్-జూన్‌లో అదనంగా 20 శాతం పెరుగుతాయని అంచనా. ఈ పరిణామం ఇప్పటికే వివో, నథింగ్ వంటి స్మార్ట్‌ఫోన్ తయారీదారులపై ప్రభావం చూపుతున్నది. జనవరిలోనే ఈ కంపెనీలు తమ ఫోన్ల ధరలను రూ. 3,000-రూ. 5,000 వరకు పెంచాయి. కొన్ని కంపెనీల తయారీదారులు మెమరీ చిప్‌లను సంపాదించేందుకు ఇబ్బంది పడుతున్నారు. కొడక్, థామ్సన్, బ్లావ్‌పంక్ట్ బ్రాండ్ల టీవీలను విక్రయించే సూపర్ ప్లాస్ట్రోనిక్స్ ఈ చిప్ కొరత కారణంగా తనకు వచ్చిన ఆర్డర్లలో కేవలం 10 శాతాన్ని మాత్రమే నెరవేర్చగలుగుతున్నది.
గత నవంబర్‌లో 7 శాతం ధరలు పెంచామని, ఈనెలలో మరో 10 శాతం ధరలు పెంచుతామని, ఫిబ్రవరిలో మరో 4 శాతం పెంపు ఉంటుందని కంపెనీ సీఈవో నవనీత్ సింగ్ మార్వా తెలిపారు. రిటైల్ చెయిన్లు ఇప్పటికే ల్యాప్‌టాప్ ధరలను 5-8 శాతం పెంచగా, ధరల పెంపుపై ప్రధాన టెలివిజన్ బ్రాండ్లు ఆలోచన సాగిస్తున్నాయి. ఈ పెరుగుదల తక్షణ డిమాండుపై ప్రభావం చూపగలదని గ్రేట్ ఈస్టర్న్ రిటైల్ డైరెక్టర్ పుల్కిత్ బెయిడ్ తెలిపారు. గత ఏడాది నవంబర్-డిసెంబర్లో స్మార్ట్ఫోన్ల ధరలు 3-21 శాతం పెరిగినట్లు ఆల్ ఇండియా మొబైల్ రిటైలర్స్ అసోసియేషన్(ఏఐఎంఆర్ఏ) పేర్కొన్నది. రానున్న నెలల్లో స్మార్ట్ఫోన్ల ధరలు 30 శాతం పెరిగే అవకాశం ఉందని 1.50 లక్షల స్టోర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏఐఎంఆర్ఏ వెల్లడించింది.