హైదరాబాద్: భారతీయులు సగటున ప్రతి నెలా 36 జీబీ డేటాను వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. యాక్టివ్ స్మార్ట్ఫోన్ యూజర్ ఇండియాలో నెలకు 36 జీబీ డేటా వాడుతున్నట్లు ఎరిక్సన్ మొబిలిటీ రిపోర్టు పేర్కొన్నది. ప్రపంచంలోనే ఇది అత్యధిక వినియోగం అని నివేదికలో చెప్పారు. 2031 నాటికి మొబైల్ డేటా వినియోగం సగటున నెలకు 65 జీబీ వరకు చేరుకునే అవకాశాలు ఉన్నట్లు రిపోర్టులో వెల్లడించారు.
2025 చివరి నాటికి భారత్లో 5జీ సబ్స్క్రిప్షన్లు సుమారు 39.4 కోట్లకు చేరనున్నట్లు ఆ రిపోర్టులో వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న మొబైల్ సబ్స్క్రిప్షన్స్లో ఇది 32 శాతం అవుతుంది. అంటే 2031 నాటికి 5జీ వినియోగదారుల సంఖ్య వంద కోట్లు దాటనున్నది. అంటే అది దాదాపు 79 శాతం అవుతుందని రిపోర్టులో అంచనా వేశారు.