Smart Meters | లక్నో, మే 5: ప్రీ పెయిడ్ విద్యుత్తు స్మార్ట్ మీటర్లపై పెల్లుబికిన ప్రజాగ్రహానికి యూపీలోని బీజేపీ సర్కార్ తలొగ్గింది. ప్రతి విద్యుత్తు వినియోగదారుడు ప్రీ పెయిడ్ స్మార్ట్ మీటర్‌ను తప్పనిసరిగా వినియోగించాలన్న ఉత్తర్వులను ప్రభుత్వం రద్దు చేసి పాత పోస్ట్‌పెయిడ్ బిల్లింగ్ విధానాన్నే అమలులోకి తెస్తున్నట్టు ప్రకటించింది. దీంతో లక్షలాది మంది విద్యుత్తు వినియోగదారులకు అధిక విద్యుత్తు బిల్లుల నుంచి ఊరట లభించింది.
ఇక నుంచి అన్ని విద్యుత్తు కనెక్షన్లు పోస్ట్‌పెయిడ్ విధానంలోనే పనిచేస్తాయని, వినియోగదారులు విద్యుత్తు వినియోగం అనంతరమే నెల తర్వాత పూర్వం మాదిరిగానే 15 రోజుల వ్యవధిలో బిల్లులు చెల్లించవచ్చునని ప్రభుత్వం తెలిపింది. అయితే కొత్త విద్యుత్తు కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లనే బిగిస్తారు. వారు కూడా పోస్ట్‌పెయిడ్ విధానంలోనే బిల్లు చెల్లించవచ్చు. గత ఏడాది వ్యవధిలో పలు ఫిర్యాదులు రావడంతో గతంలో ప్రీ పెయిడ్ విధానంలోకి మార్చిన 75 లక్షల కనెక్షన్లను తిరిగి పోస్ట్ పెయిడ్ విధానంలోకి మారుస్తారు. అదే సమయంలో పాత విద్యుత్తు మీటర్ల స్థానంలో ప్రీ పెయిడ్ మీటర్ల బిగింపు కార్యక్రమాన్ని కూడా నిలిపివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
కాగా, స్మార్ట్‌మీటర్లు, ప్రీపెయిడ్ విధానంలో తమకు అధిక మొత్తంలో కరెంట్ బిల్లులు వస్తున్నాయని, పలు సాంకేతిక సమస్యలు ఏర్పడుతున్నాయని రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇటీవల ప్రజలు ఆందోళన చేశారు. పలు చోట్ల స్మార్ట్ మీటర్లను కుప్పలుగా పోసి తమ నిరసన వ్యక్తం చేశారు. వారి ఆందోళనకు తలొగ్గిన ప్రభుత్వం ప్రి పెయిడ్ బిల్లు విధానాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.
ప్రస్తుతం ఉన్న ప్రీ పెయిడ్ నుంచి పోస్ట్ పెయిడ్ విధానానికి విద్యుత్తు బిల్లు విధానాన్ని మారుస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే దీంతో ప్రజల కష్టాలు ఎంతమాత్రం గట్టెక్కని పరిస్థితి ఉంది. ఎందుకంటే బిల్లు చెల్లించే విధానంలో మార్పు వచ్చిందే తప్ప స్మార్ట్ మీటర్ ద్వారా వచ్చే అధిక బిల్లులు, విద్యుత్తు సరఫరా లోపాలు, సాంకేతిక సమస్యలు అలాగే కొనసాగుతాయి. అదే మీటర్ కాబట్టి బిల్లు కూడా అధికంగానే వస్తుంది. అయితే ఇప్పటికే బిగించిన స్మార్ట్ మీటర్లను తొలగించి మళ్లీ పాతవి అమరుస్తారా అన్న విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టత లేదు.
స్మార్ట్ మీటర్లపై యూపీ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌కు విరుద్ధంగా స్మార్ట్ మీటర్లను బిగించారు. ఇక్కడ చెక్మీటర్, మెయిన్ మీటర్లు వేరుగా ఉన్నాయి. స్మార్ట్ మీటర్ ఉన్నప్పటికీ రీడింగ్‌లను మాన్యువల్‌గానే తీసుకున్నారు. మీటర్లో లోపాలే దీనికి కారణం. గత కొన్ని నెలలుగా గ్రామీణ, పట్టణ ప్రాంతాలనే తేడా లేకుండా విద్యుత్తు వినియోగదారులు తమ కరెంట్ బిల్లులకు సంబంధించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్వం కంటే తక్కువ కరెంట్ వాడినా బిల్లు ఎక్కువగా వస్తున్నదని, స్మార్ట్ మీటర్ వేసిన తర్వాతే లెక్కలు తారుమారయ్యాయని వారు ఆరోపిస్తున్నారు.
ఇటీవల నోయిడాలో ఒక కాలనీలో హఠాత్తుగా విద్యుత్తు సరఫరా ఆగిపోయింది. ఏదైనా సాంకేతిక సమస్య కారణమేమో అనుకున్న వారికి అసలు విషయం తెలిసి షాకయ్యారు. మీ విద్యుత్తు మీటర్‌ను పోస్ట్ పెయిడ్ నుంచి ప్రీ పెయిడ్‌కు మార్చాం. మీరు గతంలో చెల్లించిన విద్యుత్తు చార్జీతో బ్యాలెన్స్ అయిపోయినందున మీకు విద్యుత్తు సరఫరా నిలిపివేశామని విద్యుత్తు శాఖ అధికారులు తాపీగా చెప్పారు. మాకు తెలియకుండా, మా అనుమతి లేకుండా స్మార్ట్ మీటర్లుగా ఎలా మారుస్తారు అంటూ ప్రజలు అధికారులను నిలదీశారు.
ప్రీ పెయిడ్ మీటర్లపై పెద్దయెత్తున ప్రజాగ్రహం పెల్లుబుకుతుండటంతో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అప్రమత్తమయ్యారు. ఈ విషయాన్ని పరిశీలించేందుకు ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. దీంతో దీనిని కొనసాగిస్తే ప్రజల నుంచి మరింత నిరసన వ్యక్తమవుతుందని భావించి దీనిని రద్దు చేయడానికి నిర్ణయించారు. దీంతో ఇకపై అన్ని స్మార్ట్ మీటర్లు పోస్ట్ పెయిడ్ విధానంలో నిర్వహిస్తామని రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి ఏకే శర్మ ప్రకటించారు.