న్యూఢిల్లీ, జూలై 23: చిరు వ్యాపారులకు వాణిజ్య పన్నుల శాఖ పన్ను నోటీసులు జారీచేయడాన్ని నిరసిస్తూ కర్ణాటక వ్యాప్తంగా బేకరీలు, కిరాణా దుకాణాలు, టీ షాపులు బుధవారం టీ, కాఫీ, పాలు వంటి వస్తువుల అమ్మకాన్ని నిలిపివేశాయి. చేతికి నల్ల బ్యాడ్జీలు ధరించిన చిరు వ్యాపారులు వాణిజ్య శాఖ తమపై అన్యాయంగా దాడి చేస్తోందని ఆరోపించారు. ఏ బేకరీ, టీ దుకాణం కూడా నేడు పాలు అమ్మడం లేదని, పన్ను దాడికి నిరసనగా బ్లాక్ టీని విక్రయిస్తున్నాయని కార్మిక నాయకుడు రవి షెట్టి ఓ నిరసన ప్రదేశం వద్ద తెలిపారు.
ఇతర వాణిజ్య కార్యకలాపాలకు ఎటువంటి విఘాతం ఏర్పడనప్పటికీ బేకరీలలో పాల అమ్మకం నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని టీ దుకాణాలు మాత్రం తమ కస్టమర్లకు బ్లాక్ టీని విక్రయించాయి. ఇటీవల కర్ణాటక వ్యాప్తంగా చిరు వ్యాపారులకు జీఎస్టీ నోటీసులు అందడంతో ఆందోళన నెలకొంది. ఈ నోటీసులను వెంటనే ఉపసంహరించాలని వారు డిమాండు చేస్తున్నారు. జీఎస్టీ నోటీసులకు వెరచిన చాలా మంది చిరు వ్యాపారులు యూపీఐ, ఇతర డిజిటల్ చెల్లింపులు నిరాకరిస్తూ నగదు రూపంలో చెల్లించాలని కస్టమర్లను డిమాండు చేస్తున్నారు.
2021-22 నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరం మధ్య జరిగిన యూపీఐ, డిజిటల్ చెల్లింపుల ఆధారంగా చిరు వ్యాపారుల ఆదాయ వివరాలు సేకరించిన వాణిజ్య పన్నుల శాఖ వారికి పన్ను నోటీసులు జారీచేసింది. డిజిటల్ చెల్లింపుల ద్వారా రూ. 20 లక్షల మేరకు(సర్వీసులకు), రూ. 40 లక్షల మేరకు(వస్తువులకు) వార్షిక ఆదాయాన్ని పొందిన చిరు వ్యాపారులు పన్ను చెల్లించాల్సిందేనంటూ నోటీసులు జారీచేసింది.
చెల్లింపులు యూపీఐ లేదా నగదు రూపంలో జరిగాయా అన్నది తమకు అప్రస్తుతమని, నగదు అమ్మకాలతోసహా పూర్తి టర్నోవర్ ఎంతన్నది తమకు ముఖ్యమని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఈ దెబ్బకు బెంగళూరుతోపాటు కర్ణాటకలోని ఇతర ప్రాంతాలకు చెందిన చిరు వ్యాపారులు నో యూపీఐ..ఓన్లీ క్యాష్ అని బోర్డులు పెట్టుకున్నారు. కాగా, జీఎస్టీ అధికారుల దురుసు, ఏకపక్ష పన్ను డిమాండ్లకు నిరసనగా జూలై 25న రాష్ట్రవ్యాప్త బంద్‌ను పాటించాలని వ్యాపార సంఘాలు పిలుపునిచ్చాయి.
హవేరీకి చెందిన కూరగాయల వ్యాపారి ఒకరికి భారీ మొత్తం పన్ను నోటీసు అందింది. శంకర్‌గౌడ హడీమణి అనే కూరగాయల వ్యాపారికి రూ.29 లక్షల జీఎస్టీ డిమాండు నోటీసు అందింది. గడచిన నాలుగేళ్ల యూపీఐ లావాదేవీలను లెక్కకట్టిన అధికారులు రూ. 1.63 లక్షల లావాదేవీలకు రూ. 29 లక్షల జీఎస్టీ చెల్లించాలని నోటీసు పంపారు. జీఎస్టీ నుంచి మినహాయింపు ఉన్న తాజా కూరగాయలను మాత్రమే విక్రయించే శంకర్‌గౌడ తన పన్ను రిటర్న్‌లను తాను క్రమం తప్పకుండా దాఖలు చేస్తుంటానని, అంత భారీ మొత్తాన్ని ఎలా కట్టాలో తనకు అర్థం కావడం లేదని ఆయన తెలిపారు.