న్యూఢిల్లీ, జనవరి 18: చిన్నపాటి వెలుతురు (బెడ్ లైట్), మంచి సంగీతం వింటూ నిద్రపోవటం ఆరోగ్యానికి మంచిది కాదని తాజా అధ్యయనం ఒకటి హెచ్చరించింది. గుండె జబ్బులు, స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతున్నదని ‘జామా నెట్వర్క్ ఓపెన్’ కథనం పేర్కొన్నది. గుండె, మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే బెడ్రూమ్లను పూర్తిగా చీకటిగా ఉంచాలని పరిశోధన సూచించింది. పూర్తి చీకట్లో నిద్రపోయిన వాళ్లతో పోల్చితే, రాత్రంతా బెడ్‌లైట్ లేదా సాఫ్ట్ మ్యూజిక్ వింటూ నిద్రపోయే వాళ్లలో గుండె జబ్బుల ముప్పు 30 శాతం ఎక్కువగా ఉందని తేలింది. అలాగే బ్రెయిన్ స్ట్రోక్, గుండె జబ్బుల ముప్పును 50 శాతం పెంచుతున్నదని సైంటిస్టులు అంచనావేశారు. యూకేలో పరిశోధకుల బృందం 9 సంవత్సరాలుగా 90 వేల మంది పెద్దలను ట్రాక్ చేసింది. అధ్యయనంలో పాల్గొన్న వారి నిద్ర రీతుల్ని, ఆరోగ్య పరిస్థితుల్ని వారు విశ్లేషించారు.