Weekend Sleep | న్యూఢిల్లీ : ఆధునిక జీవనశైలి నిద్రపోయే సమయాలను మార్చేస్తున్నది. పని దినాల్లో నిద్ర కరువవుతున్నది. దీంతో జనం వారాంతాల్లో ఎక్కువ సమయం నిద్రపోతూ ఉంటారు. పని దినాల్లో కోల్పోయిన నిద్రకు పరిహారంగా వారాంతాల్లో ఇంకొంత ఎక్కువ సమయం నిద్రపోవడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని బ్రిటన్ బయోబ్యాంక్ అధ్యయనం వెల్లడించింది.
యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ కాంగ్రెస్, 2024లో సమర్పించిన పరిశోధన నివేదిక ప్రకారం, వారాంతాల్లో ఎక్కువ సమయం మేలుకుని ఉండేవారికన్నా, ఎక్కువసేపు నిద్రపోయేవారికి గుండె జబ్బుల ముప్పు 20 శాతం తగ్గుతుందని తేలింది. చైనా పరిశోధకుడు యాంజున్ సోంగ్ మాట్లాడుతూ, కోల్పోయిన నిద్రకు పరిహారంగా తగినంత సమయం నిద్రపోవడం వల్ల గుండె జబ్బుల ముప్పు తగ్గుతుందన్నారు.