అలీగఢ్, జూలై 28: విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన ప్రిన్సిపాల్ కమ్ టీచర్ ఒకరు ఏకంగా క్లాస్ రూమ్‌లోనే హాయిగా నిద్రపోయారు. తరగతి గదిలో నేలపై చాప వేసుకొని సేదతీరారు. పైగా ఆమె నిద్రకు ఎలాంటి భంగం కలగకుండా విసనకర్రతో విసిరే బాధ్యతను విద్యార్థులకు అప్పగించారు. దీంతో వంతులవారీగా పిల్లలు ఆమెకు సేవలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ జిల్లా ధనిపూర్ ప్రాంతంలోని గోకుల్పూర్ ప్రాథమిక పాఠశాలలో చేటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. దీంతో ప్రాథమిక విద్యాశాఖ అధికారి రాకేశ్ కుమార్ సింగ్.. క్లాసులో నిద్రపోయిన డింపుల్ బన్సాల్ అనే ఆ మహిళా ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించారు. ఆమె విద్యార్థులను కొడుతున్న మరో వీడియో కూడా వైరల్ అయ్యింది. దీనిపై కూడా విచారణ చేస్తున్నట్టు ఆయన చెప్పారు.