న్యూఢిల్లీ : భారత్-అమెరికా తాత్కాలిక వాణిజ్య ఒప్పందాన్ని రైతు వ్యతిరేకంగా అభివర్ణించిన సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం).. ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేసింది. మార్చి 9 నుంచి తిరిగి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాలకు ముందు దేశవ్యాప్తంగా బహిరంగ సభలను నిర్వహించనున్నట్లు ఎస్కేఎం ప్రకటించింది. ఒప్పందంపై సంతకం చేయవద్దని ప్రధాని మోదీని ఆదేశించాలని రాష్ట్రపతి ముర్ముకు ఎస్కేఎం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. వ్యవసాయ, డెయిరీ రంగాలను బహుళ జాతి కంపెనీలకు తలుపులు బార్లా తెరిచి భారతదేశ స్వావలంబన, సార్వభౌమత్వాన్ని తాకట్టుపెట్టిన ద్రోహిగా కేంద్ర వాణిజ్య మంత్రిని ఎస్కేఎం అభివర్ణించింది. మంత్రిని తొలగించాలని కోరుతూ రాష్ట్రపతికి బహిరంగ లేఖ రాయనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఉన్న బోనస్ విధానాన్ని సమీక్షించాలని, గోధుమ, వరి ధాన్యానికి బోనస్‌ను నిలిపివేసే విషయాన్ని పరిశీలించాలని కోరుతూ కేరళ ప్రభుత్వానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ రాసిన లేఖను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఎస్కేఎం డిమాండ్ చేసింది.
ప్రభుత్వ లేఖపై సంతకం చేసిన వ్యవసాయ శాఖ కార్యదర్శి వీ వులన్నామ్ని తొలగించాలని డిమాండు చేస్తూ క్యాబినెట్ కార్యదర్శికి లేఖ రాస్తామని ఎస్కేఎం తెలిపింది. ఒప్పందాన్ని రద్దు చేయాలని కోరుతూ ఫిబ్రవరి 27న లేదా మరో తేదీన సంబంధిత ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నాయకుడిని ఎస్కేఎం రాష్ట్ర సమన్వయ కమిటీలు కలుసుకుంటాయని సమాఖ్య వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక స్వాతంత్య్రంపై దాడి చేసి, రైతులకు వారి పంటకు గిట్టుబాటు ధరను పొందే హక్కును వ్యతిరేకిస్తున్న డీఓ లేఖను ఉపసంహరించుకోవాలనికోరనున్నట్లు ఎస్కేఎం తెలిపింది. రాష్ర్టాల ఫెడరల్ హక్కులను పరిరక్షించవలసిందిగా సీఎంలు, ప్రతిపక్ష నాయకుడిని కూడా డిమాండు చేయనున్నట్లు ఎస్కేఎం పేర్కొన్నది.
ముడి చమురు కొనుగోళ్లు తగ్గిపోవడంతో ఈ ఏడాది జనవరిలో రష్యా నుంచి భారత్ వాణిజ్య దిగుమతులు 40.5 శాతం క్షీణించాయి. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకున్నట్లు హిందుస్థాన్ టైమ్స్ కథనం పేర్కొన్నది. 2025 జనవరిలో రష్యా నుంచి 481 కోట్ల డాలర్ల కొనుగోళ్లు జరుగగా 2026 జనవరిలో రష్యా నుంచి వస్తు దిగుమతుల విలువ 286 కోట్ల డాలర్లకు పడిపోయింది. దీనికి రష్యన్ ముడి చమురు కొనుగోళ్లు తగ్గడమే కారణమని వార్తా కథనం పేర్కొన్నది. భారత్ చేసుకునే మొత్తం చమురు దిగుమతిలో 80 శాతం రష్యా నుంచే జరుగుతున్నది. ఈ ఏడాది జనవరి గణాంకాలను పరిశీలిస్తే మన చమురు శుద్ధి కంపెనీలు రష్యా నుంచి చమురును కొనుగోలు చేయడం తగ్గించివేసినట్లు అర్థమవుతున్నది.