జైపూర్ : పాఠశాలల తనిఖీ కార్యక్రమంలో భాగంగా గ్రామంలోకి వస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కార్యకర్తలను గ్రామస్తులు అడ్డుకోవడమే కాక, వారిపై దాడి చేసిన ఘటన బీజేపీ పాలిత రాజస్థాన్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. జైపూర్ జిల్లా రాంపుర కన్వర్‌పుర గ్రామంలోని పాఠశాలల పరిస్థితిని తెలుసుకునేందుకు సీజేపీ బృందం ఉగయం 8 గంటల ప్రాంతంలో రాగా, గ్రామస్తులు వారిని అడ్డుకుని అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. అయితే పాఠశాలను తనిఖీ చేయకుండా తాము వెళ్లబోమని భీష్మించిన సీజేపీ నేతలు పాఠశాల బయట నిరసనకు దిగారు. దీంతో వారిపై గ్రామస్తులు దాడి చేశారు. బీజేపీకి చెందిన కొందరు తమపై రాళ్లతో దాడి చేశారని, కారు అద్దాలను పగులగొట్టారని, బట్టలు చింపేశారని, బృందంలోని మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని, కొందరు ప్రతినిధులు గాయపడ్డారని పాఠశాల తనిఖీ బృందంలో ఉన్న సీజేపీ జాతీయ అధికార ప్రతినిధి అశుతోష్ రాంకా ఆరోపించారు. దాడికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతున్నాయి. ఈ దాడిలో రాంకాతో పాటు మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఎస్ఎంఎస్ దవాఖానకు తరలించారు. కాగా, సీజేపీ నేతలపై దాడి చేసింది గ్రామస్తులు కాదని, బీజేపీ కార్యకర్తలని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్డోటాస్రా ఆరోపించారు.
రాజస్థాన్ విద్యా శాఖ మంత్రి మదన్ దిలావర్ ఆదేశాల మేరకే తమపై దాడి జరిగిందని సీజేపీ నేత రాంకా ఆరోపించారు. బీజేపీ గూండాగిరీని దేశ ప్రజలంతా లైవ్‌లో చూశారని అన్నారు. తమపై దాడి చేసిన వారిని 48 గంటల్లో అరెస్ట్ చేయాలని, స్కూళ్లను తనిఖీ చేయరాదంటూ ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని ఆయన అల్టిమేటం ఇచ్చారు. పాఠశాల ప్రాంగణంలో పశువుల షెడ్డును నిర్మించారని, తమ పర్యటనలో ఇది ఎక్కడ బయట పడుతుందోనని దానిని ఏర్పాటు చేసిన మదన్ దిలావర్ తమపై దాడి చేయించారని ఆరోపించారు. ఇది గ్రామస్తుల పని ఎంతమాత్రం కాదని, కొందరు బయటివారు వచ్చి రెచ్చగొట్టడం వల్లే ఈ హింసాత్మక ఘటన చోటుచేసుకుందని తెలిపారు. కాగా, సీజేపీ తమ గ్రామంలోకి రావడాన్ని అడ్డుకున్నామే తప్ప, వారిపై దాడి చేయలేదని గ్రామస్తులు తెలిపారు.
సీజేపీ నేతలపై దాడి చేయడాన్ని ఆ పార్టీ చీఫ్ అభిజీత్ దీప్కే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజస్థాన్‌లో ఏం జరుగుతున్నదని ప్రశ్నించారు. బీజేపీ గూండాలు.. అశుతోష్, ఇతర సీజేపీ కార్యకర్తల ప్రాణాలను తీయడానికి ప్రయత్నించారని ఎక్స్‌లో ఆరోపించారు. సీజేపీపై దాడి జరుగుతుంటే అక్కడ ఉన్న పోలీసులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. అయితే అటువంటి పరిణామం జరిగినట్టు తమకు తెలియదని బగ్రు డీఎస్పీ ధర్మేంద్ర శర్మ పేర్కొన్నారు.