న్యూఢిల్లీ : యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ముసాయిదా నిబంధనలను ఉపసంహరించాలని ప్రతిపక్షాల పాలనలోని ఆరు రాష్ర్టాలు డిమాండ్ చేశాయి. జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)కి అనుగుణంగా ఈ నిబంధనలను సవరించినట్లు చేస్తున్న వాదనలో పస లేదని కాంగ్రెస్ బుధవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. కర్ణాటక ఉన్నత విద్యా శాఖ మంత్రి ఎంసీ సుధాకర్ నేతృత్వంలో కర్ణాటక, తెలంగాణ, కేరళ, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్ రాష్ర్టాల ఉన్నత విద్యా శాఖ మంత్రులు, వారి ప్రతినిధుల సమావేశం బెంగళూరులో జరిగిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి (కమ్యూనికేషన్స్) జైరామ్ రమేశ్ చెప్పారు. యూజీసీ డ్రాఫ్ట్ రెగ్యులేషన్స్, 2025ను వ్యతిరేకిస్తూ ఓ తీర్మానాన్ని ఆమోదించారని తెలిపారు. సమాఖ్య వ్యవస్థ రాజ్యాంగ సిద్ధాంతాలను ఉల్లంఘించరాదని చెప్పారు. ముఖ్యంగా ఉన్నత విద్య నాణ్యతపై విద్యా మంత్రిత్వ శాఖ దృష్టి పెట్టాలన్నారు.