ముంబై, జూన్ 22: శివసేన (యూబీటీ)కి చెందిన ఆరుగురు తిరుగుబాటు ఎంపీలు సోమవారం మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని అధికార శివసేనలో చేరిపోయారు. దీంతో ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలోని శివసేన(యూబీటీ) పార్లమెంటరీ పార్టీలో అధికారికంగా చీలిక ఏర్పడింది. శివసేన(యూబీటీ)కి లోక్సభలో 9 మంది ఎంపీలు ఉన్నారు. మూడింట రెండు వంతుల సంఖ్యాబలాన్ని సాధించడానికి తిరుగుబాటు వర్గానికి కనీసం ఆరుగురు సభ్యుల అవసరం ఉంది.
శివసేన(యూబీటీ)కి చెందిన ఆరుగురు ఎంపీలను తన వర్గంలోకి చేరుకున్న అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏక్నాథ్ షిండే మాట్లాడుతూ ఈ పరిణామం తమ పార్టీకి ఒక గొప్ప బలంగా పేర్కొన్నారు.
ఉద్ధవ్ వర్గంలో ఎమ్మెల్యేలూ తిరుగుబాటుకు సిద్ధమవుతున్నట్లు కనపడుతున్నది. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజు సోమవారం పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే నిర్వహించిన శాసనసభాపక్ష సమావేశానికి నలుగురు డుమ్మా కొట్టారు.