Road accident : కంటెయినర్ ట్రక్కు కారుపై జారిపడి ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. కర్ణాటక రాష్ట్రంలోని నీలమంగళ పట్టణ సమీపంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. మరణించిన ఆరుగురిలో ఇద్దరు చిన్నారులున్నారు. వివరాల్లోకి వెళ్తే.. నీలమంగళ పట్టణానికి చెందిన ఓ కుటుంబం గత అక్టోబర్‌లో కొత్త కారును కొనుగోలు చేసింది. శనివారం ఉదయం కారులో జాలీగా తిరిగొద్దామని కుటుంబంలోని నలుగురు బయలుదేరారు.
వారి కారు జాతీయ రహదారి నాలుగుపై వెళ్తుండగా.. బెంగళూరు నుంచి తుమకూరు వెళ్తున్న కంటెయినర్ ట్రక్కు వారికి సమాంతరంగా వచ్చింది. అదే సమయంలో కంటెయినర్ ట్రక్కు ముందు వెళ్తున్న కర్ణాటక మిల్క్ ఫెడరేషన్‌కు చెందిన పాల ట్రక్కును ఢీకొట్టింది. ఆ వెంటనే అదుపుతప్పి పక్కనే వెళ్తున్న కారు, బైకుపైకి ఒరిగిపోయింది. ఈ ప్రమాదంలో కారులోని నలుగురు, బైకుపై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారని, ప్రస్తుతం మృతదేహాలు నీలమంగళ ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్నాయని బెంగళూరు రూరల్ ఎస్పీ సీకే బాబా తెలిపారు. నడిరోడ్డుపై ఘోర ప్రమాదం జరగడంతో జాతీయ రహదారిపై మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయిందని ఆయన చెప్పారు. పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేసిన పనిలో ఉన్నారని అన్నారు.