కొత్తగూడెం ప్రగతి మైదాన్, జూలై 18 : మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నారాయణ్‌పూర్ జిల్లా అబూజ్మడ్ అడవుల్లో శుక్రవారం చోటు చేసుకుంది. నారాయణ్‌పూర్ జిల్లా ఎస్పీ రాబిన్సన్ గుడియా ఈ వివరాలు వెల్లడించారు. అబూజ్మడ్ అడవుల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు భద్రతా దళాలు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలో మావోయిస్టులు తారసపడి జవాన్లపైకి కాల్పులు జరిపారు.
వెంటనే అప్రమత్తమైన జవాన్లు ఎదురుకాల్పులకు దిగడంతో ఇరువర్గాల మధ్య సుమారు గంటన్నరపాటు కాల్పులు జరిగినట్లు తెలుస్తున్నది. జవాన్ల ధాటికి తాళలేక మావోయిస్టులు కాల్పులు జరుపుతూనే అటవీ మార్గం మీదుగా పారిపోయారు. తర్వాత జవాన్లు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఆరుగురు మావోయిస్టుల మృతదేహాలతోపాటు ఒక ఏకే-47, ఒక ఎస్ఎల్ఆర్ రైఫిల్‌తోపాటు ఇతర మారణాయుధాలు, వస్తు సామగ్రిని జవాన్లు స్వాధీనం చేసుకున్నారు.