న్యూఢిల్లీ, జులై 12: ఈశాన్య ఢిల్లీలోని వెల్కమ్ ప్రాంతంలో శనివారం ఉదయం ఓ నాలుగు అంతస్తుల భవనం కూలిపోయిన ఘటనలో ఓ రెండేళ్ల బాలిక సహా ఆరుగురు వ్యక్తులు మరణించారు. మరో 8 మంది గాయపడ్డారు. భవన యజమాని, ఆయన భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు ఇతరుల మృతదేహాలను శిథిలాల నుంచి వెలికితీసి జీటీబీ దవాఖానాకు తరలించినట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు. గాయపడిన 8 మందికి చికిత్స అందచేస్తున్నామని చెప్పారు. ఈ ఘటనలో ఎదురుగా ఉన్న భవనం కూడా ధ్వంసమైందని, అందులోని వారు కూడా గాయపడ్డారని తెలిపారు.
రింగ్ రోడ్ల పక్కన నిర్మాణాలపై నిషేధం! ; ప్రజావసరాల కోసం కేంద్రం ప్రతిపాదన
న్యూఢిల్లీ: గ్రీన్‌ఫీల్డ్, యాక్సెస్ కంట్రోల్డ్ బైపాస్‌లు/రింగ్ రోడ్లకు ఇరువైపులా 15 మీటర్ల పరిధిలో ఎటువంటి నిర్మాణాలను చేపట్టకుండా నిషేధం విధించాలని కేంద్రం ఆలోచిస్తున్నది. కేంద్రం రాష్ర్టాల్లో నిర్మించే బైపాస్‌లు, రింగ్ రోడ్లకు ఈ నిబంధనలను వర్తింపజేయాలని యోచిస్తున్నది. ఈ ప్రతిపాదనలకు తుది రూపం ఇవ్వడానికి కేంద్ర రోడ్డు రవాణా శాఖ కృషి చేస్తున్నది. దీని ప్రకారం బైపాస్‌లు, గ్రీన్ ఫీల్డ్‌ల ఇరువైపులా 15 మీటర్ల పరిధిని రాష్ట్ర ప్రభుత్వాలు ‘నో కన్స్ట్రక్షన్ గ్రీన్ జోన్’గా నోటిఫై చేయాల్సి ఉంటుంది. ప్రతిపాదిత బైపాస్‌ల వెంబడి క్రమబద్ధమైన అభివృద్ధిపై దృష్టి పెట్టినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ ప్యానెల్ తెలిపింది. బైపాస్ లేదా రోడ్‌కు ఇరువైపులా 2 కి.మీ. పరిధిలో సంస్థాగత మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రణాళికలను రాష్ట్ర ప్రభుత్వాలు రచించవచ్చు.