హైదరాబాద్, అక్టోబర్ 15 ( స్పెషల్ టాస్క్ బ్యూరో నమస్తే తెలంగాణ): మధ్యప్రదేశ్‌లో అధికార బీజేపీకి అసంతృప్తుల బెడద ఎక్కువైంది. ఇప్పటివరకు 136 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. మొత్తం 230 స్థానాలకు గాను మరో 94 మంది అభ్యర్థుల పేర్లు ఖరారు చేయాల్సి ఉంది. అయితే సిట్టింగులు, సీనియర్ నాయకులను కాదని ఇతర పార్టీల నుంచి వచ్చినవారికి, కొత్త ముఖాలకు టికెట్లు ఎట్లా ఇస్తారని స్థానిక నాయకత్వం ప్రశ్నిస్తున్నది.
దీంతో ఆందోళనకు గురైన అధిష్ఠానం అసమ్మతిని తగ్గించి, అసంతృప్తులను బుజ్జగించి పార్టీ వీడకుండా చూసేందుకు సీఎం శివరాజ్ సింగ్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా నలుగురు బడా నేతలతో ఓ కమిటీని నియమించింది. ఒక్కో కమిటీ సభ్యుడు 300 మంది నేతలతో చర్చలు జరపాలని టార్గెట్ పెట్టింది. ఇంకా అభ్యర్థులను ప్రకటించని 94 సీట్లలో 67 స్థానాలు పార్టీ సిట్టింగ్ సీట్లే కావడం గమనార్హం. ఇందులో 9 మంది రాష్ట్ర మంత్రులూ ఉన్నారు. ఆయా నియోజక వర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత వల్ల ఇంతవరకు అభ్యర్థులను ఖరారు చేయలేకపోతున్నారు. బీజేపీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని ఈ సారి ఎన్నికల్లో కొత్త ముఖాలకు అవకాశమివ్వాలని సంఘ్ పరివార్ నిర్దేశించటంతో అభ్యర్థల ఎంపిక ఇబ్బందిగా మారిందని సమాచారం.
ప్రస్తుత ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్‌ను ఎన్నికల తరువాత మారుస్తారని, కొత్త ముఖ్యమంత్రి రేసులో తామంటే తాము ఉన్నామంటూ సీనియర్ నేతలు చేస్తున్న ప్రకటనలను కూడాపార్టీ అధిష్ఠానం సీరియస్‌గా తీసుకుంది. సీఎం రేసులో తానున్నానని నాయకులు చేస్తున్న వ్యక్తిగత ప్రకటనల వల్ల పార్టీకి మరింత నష్టం జరుగుతున్నదని బీజేపీ అధిష్ఠానం భావిస్తున్నది. వయసు, అనారోగ్య కారణాలను చూపుతూ ఇద్దరు మంత్రులను ఎన్నికల్లో పోటీ చేయవద్దని ఆదేశించింది. పార్టీలో ఎన్నో ఏండ్ల నుంచి కష్టపడుతున్న కార్యకర్తలు, నాయకులకు కాకుండా ఎన్నికలప్పుడు బీజేపీలో చేరిన ఇతర పార్టీల నాయకులకు ఎలా టికెట్లిస్తారని స్థానిక నాయకత్వం ప్రశ్నిస్తున్నది. దీంతో టికెట్ల కేటాయింపుపై పార్టీ అధిష్ఠానం మీన మేషాలు లెక్కిస్తున్నది.
బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో 40 మందికి ఈసారి టికెట్లు కట్ చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. ప్రజల్లో వ్యతిరేకత, ఆయా ఎమ్మెల్యేల విజయావకాశాలు తక్కువని వచ్చిన సర్వే ఫలితాల వల్ల చాలావరకు గెలుపు గుర్రాలనే ఎన్నికల బరిలో దించాలని సంఘ్ పరివార్ నాయకుల నుంచి బీజేపీకి ఆదేశాలు అందినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఒకవేళ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వకపోతే వారు ఇతర పార్టీల్లోకి వెళ్లే అవకాశముందని, అందుకే ఆఖరి నిమిషం వరకు వారి పేర్లను అధిష్ఠానం నిలిపివేత జాబితాలో పెడుతున్నదని, అదే బీజేపీకి తలనొప్పిగా తయారైందని రాజకీయ విశ్లేషకుడు అరుణ్ దీక్షిత్ అభిప్రాయపడ్డారు.
జైపూర్: బీజేపీలో తనకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంపై ఆగ్రహంతో ఉన్న వసుంధరరాజే.. సొంతపార్టీకి షాక్ ఇవ్వనున్నట్టు తెలుస్తున్నది. అసెంబ్లీ టికెట్ దక్కని వసుంధర విధేయులు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగనున్నట్టు సమాచారం. ‘పార్టీ కోసం జీవితాన్ని అంకితం చేసిన నన్ను మోసం చేశారనిపిస్తున్నది. నా ప్రజలు నేను పోటీ చేయాలని కోరుతున్నారు. నేను పోటీ చేస్తాను’ అని నగర్‌కు చెందిన అనితా సింగ్ గుర్జర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు నర్పత్ సింగ్ రిజ్వి, రాజ్‌పాల్ సింగ్ షెకావత్ కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మొదటి జాబితా విడుదలైన నేపథ్యంలో వందలాది మంది వసుంధరా రాజే మద్దతుదారులు శనివారం ఆమె అధికారిక నివాసం ముందు గుమికూడి ఆమెకు మద్దతు తెలిపారు. అసెంబ్లీ అభ్యర్థుల రెండో జాబితాను ప్రకటించే ముందు పార్టీ హైకమాండ్‌కు ఒక సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే వారిలా గూమికూడినట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో టికెట్ల కేటాయింపు బీజేపీకి తలనొప్పిగా మారే అవకాశమున్నట్టు కనిపిస్తున్నది.
భోపాల్: రానున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం, బీజేపీ నేత శివరాజ్ సింగ్ చౌహాన్‌పై ప్రముఖ నటుడు విక్రమ్ మస్తల్‌ను కాంగ్రెస్ బరిలోకి దింపింది. బుధ్ని నియోజకవర్గంలో వీరిద్దరు పోటీపడనున్నారు. ఆదివారం కాంగ్రెస్ ప్రకటించిన 144 మందితో కూడిన తొలి అభ్యర్థుల జాబితాలో మస్తల్ పేరు కూడా ఉన్నది. 2008లో ప్రసారమైన ‘రామాయణ’ టెలివిజన్ షో సిరీస్‌లో హనుమంతుడి పాత్రతో విక్రమ్ మస్తల్ ఫేమస్ అయ్యారు. మాజీ సీఎం కమల్‌నాథ్ ఛింద్వారా నుంచి పోటీచేయనున్నారు.