Sitaram Yechury | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: ప్రముఖ కమ్యూనిస్టు యోధుడు, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గురువారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్తో ఆయన గత నెల 19 నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఏచూరి వయసు 72 ఏండ్లు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వామపక్ష నేత మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సహా పలువురు జాతీయ, రాష్ట్ర నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు. ఏచూరి భౌతిక కాయాన్ని వైద్య పరిశోధనల నిమిత్తం ఎయిమ్స్‌కు దానం చేస్తున్నట్టు ఆయన కుటుంబం ప్రకటించింది. అంతకుముందు ఆయన భౌతిక కాయాన్ని శనివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ప్రజల సందర్శనార్థం ఢిల్లీలోని సీపీఎం ప్రధాన కార్యాలయంలో ఉంచనున్నట్టు పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో రాణించిన ఏచూరి దేశంలో మార్క్సిస్టు సిద్ధాంతకర్తగా పేరొందారు. ఏచూరి 2015 నుంచి సీపీఎం ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. అతి చిన్న వయసులోనే పార్టీ కేంద్ర కమిటీకి ఎన్నికైన ఆయన 1992 నుంచి పొలిట్‌బ్యూరో సభ్యునిగా ఉన్నారు. 2005 నుంచి 2017 వరకు రెండు పర్యాయాలు పశ్చిమ బెంగాల్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2017లో ఉత్తమ పార్లమెంటేరియన్‌గా ఎంపికయ్యారు.
సీతారాం ఏచూరి పూర్వ మద్రాస్ రాష్ట్రంలో 1952 ఆగస్టు 12న తెలుగు కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి సర్వేశ్వర సోమయాజుల ఏచూరి ఏపీఎస్ఆర్టీసీలో ఇంజినీర్‌గా పనిచేశారు. తల్లి కల్పకం ఏచూరి ప్రభుత్వ ఉద్యోగి. ఏపీ ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ ప్రధానకార్యదర్శిగా పనిచేసిన మోహన్‌కందాకు ఏచూరి మేనల్లుడు. పుట్టింది మద్రాస్‌లోనే అయినా ఆయన హైదరాబాద్‌లోని ఆల్ సెయింట్స్ హైస్కూల్లో విద్యాభ్యాసం చేశారు. 1969లో తెలంగాణ ఉద్యమం సమయంలో ఆయన ఢిల్లీ వెళ్లి సీబీఎస్ఈ హయ్యర్ సెకండరీ పరీక్షలో ఆల్ ఇండియా మొదటి ర్యాంక్ సాధించారు. ఢిల్లీలోనే సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో బీఏ (ఆనర్స్), జేఎన్‌యూలో ఎంఏ చదివారు. ఎమర్జెన్సీ కాలంలో అరెస్టయిన కారణంగా ఆర్థిక శాస్త్రంలో ఆయన పీహెచ్‌డీని పూర్తిచేయలేకపోయారు. ఏచూరి భార్య సీమా చిస్తీ ‘ది వైర్’ వెబ్ పోర్టల్‌కు సంపాదకురాలు కాగా, కుమార్తె అఖిల ఏచూరి ఎడిన్బర్గ్, సెయింట్ ఆండ్రూస్ యూనివర్సిటీలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు.
సీపీఎం విద్యార్థి సంఘమైన ఎస్ఎఫ్ఐలో ఏచూరి 1974లో చేరారు. ఆ మరుసటి సంవత్సరమే ఆయన సీపీఎం సభ్యుడయ్యారు. ఎమర్జెన్సీ తరువాత 1977-78లో జేఎన్‌యూ విద్యార్థి యూనియన్‌కు మూడుసార్లు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తన సహచర కామ్రేడ్ ప్రకాశ్ కారత్‌తో కలిసి జేఎన్‌యూను దుర్భేద్యమైన వామపక్ష కోటగా నిర్మించేందుకు కృషి చేశారు. 1986 వరకు ఎస్ఎఫ్ఐలో కొనసాగిన ఏచూరి 1978లో ఆ విద్యార్థి సంఘానికి అధ్యక్షుడు అయ్యారు. 1992 నుంచి పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యునిగా కొనసాగుతున్న ఏచూరి 2015లో విశాఖపట్నంలో జరిగిన పార్టీ మహాసభలలో సీపీఎం ఐదో ప్రధానకార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ తరువాత 2018, 2022లో జరిగిన పార్టీ మహాసభల్లో తన పదవిని నిలబెట్టుకున్నారు.
సంకీర్ణ రాజకీయాలలో సీపీఎం మాజీ ప్రధాన కార్యదర్శి హరికిషన్‌సింగ్ సూర్జిత్ నిర్వహించిన కీలక పాత్రను ఏచూరి మరింత ముందుకు తీసుకెళ్లారు. 1996లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు కాంగ్రెస్ నేత చిదంబరంతో కలిసి కనీస ఉమ్మడి కార్యక్రమం (సీఎంపీ) ముసాయిదాను రూపొందించారు. 2004లో యూపీఏ ప్రభుత్వ ఏర్పాటు సమయంలో సంకీర్ణ కూటమి నిర్మాణంలో క్రియాశీలక పాత్ర పోషించారు. ఏచూరి మంచి వక్త, రచయితగా పేరొందారు. సీపీఎం పార్టీ పక్ష పత్రిక ‘పీపుల్స్ డెమోక్రసీ’కి గత 20 ఏండ్లుగా సంపాదకునిగా ఉన్నారు. హిందుస్థాన్ టైమ్స్ పత్రికలో ‘లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్’ పేరుతో కాలమ్ రాస్తున్నారు.