రాంచీ: జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ వదిన, బీజేపీ మహిళా నేత సీతా సోరెన్ (Sita Soren) తిరిగి సొంతగూటికి చేరనున్నారు. మంగళవారం ఆమె జేఎంఎంలో చేరుతారంటూ జోరుగా ప్రచారం జరుగుతున్నది. ఈ నెల 2న పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆమె బీజేపీని వీడి జేఎంఎం తీర్థం పుచ్చుకుంటారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతున్నది. 2024 లోక్సభ ఎన్నికలకు ముందు సీతా సోరెన్ బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో దుమ్కా నుంచి పోటీచేసిన ఆమె ఓటమి చవిచూశారు.
కాగా, పార్టీ మార్పు ప్రచారంపై మీడియా ఆమెను సంప్రదించగా.. తాను ఈ నెల 2న దుమ్కా వెళ్తున్నానని, కాలమే ఈ ప్రశ్నకు సమాధానం చెబుతుందని తెలిపారు. చర్చించే వాళ్లను చర్చించనివ్వండి అంటూ తాను సర్వతి పూజ కోసం అక్కడి వెళ్తున్నాని చెప్పారు. బీజేపీ నుంచి దుమ్కా లోక్సభ అభ్యర్థిగా పోటీచేసిన ఆమె జేఎంఎంకు చెందిన నళిన్ సోరెన్ చేతిలో ఓడిపారు. అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆమె ఓటమి చవిచూశారు. ఆ ఎన్నికల్లో జంతారా నుంచి బరిలోకి దిగిన ఆమెను కాంగ్రెస్ అభ్యర్థి ఇర్ఫాన్ అన్సారీ 43,676 ఓట్ల భారీ మెజారిటీతో ఓడించారు.