మంగళూరు: కర్నాటకలోని ధర్మస్థలి(Dharmasthala)లో ఏడు మంది పురుషులకు చెందిన పుర్రెలు లభ్యమయ్యాయి. దక్షిణ కన్నడ జిల్లాలోని బంగ్లగూడ ప్రాంతంలో సిట్ పోలీసులు చేపట్టిన తొవ్వకాల్లో ఆ కళేబరాలు దొరికాయి. ధర్మస్థలి అడవుల్లో సామూహికంగా మహిళలను పాతిపెట్టినట్లు ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గత కొన్నాళ్ల నుంచి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బృందం తనిఖీలు చేస్తున్న విషయం తెలిసిందే. బుధవారం రోజున అయిదు, గురువారం రెండు పుర్రెలను సిట్ పోలీసులు వెలికి తీశారు.
అయితే ఆ పుర్రెలు ఏడాది క్రితం పాతిపెట్టినట్లు ఉన్నాయని తెలుస్తోంది. ఫోరెన్సిక్ పరీక్షలు చేపడితే మరిన్ని నిజాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆ దొరికిన పుర్రెలకు చెందిన వ్యక్తులు బహుశా సూసైడ్ చేసుకుని ఉంటారని కొందరు భావిస్తున్నారు.
యాంటీ నక్సల్ దళానికి చెందిన సిబ్బంది, పోలీసులు, ఫారెస్టు ఆఫీసర్లు.. ధర్మస్థలి ప్రాంతంలో సామూహిక ఖనన ప్రదేశాల్లో గాలింపు చేస్తున్నారు. మహిళలను పాతిపెట్టినట్లు ఫిర్యాదు ఇచ్చిన సీఎన్ చిన్నయ్య ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నాడు. గురువారం స్టేట్మెంట్ రికార్డు చేసేందుకు బెల్తంగడి కోర్టులో అతన్ని హాజరుపరిచారు.
మళ్లీ సెప్టెంబర్ 23వ తేదీన చిన్నయ్యను కోర్టు ముందు హాజరుపరచనున్నారు. ధర్మస్థలి సామూహిక ఖనన ప్రదేశాల గురించి ఏదైనా సమాచారం ఉంటే దాన్ని రికార్డు చేయాలని గురువారం హైకోర్టు జస్టిస్ ఎం నాగప్రసన్న ఆదేశాలు ఇచ్చారు.