న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) వినయ్ కుమార్ సక్సేనాకు బుధవారం లేఖ రాశారు. బీజేపీ పాలనలో ఉన్న ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ)లో జరిగిన రూ.6,000 కోట్ల కుంభకోణంపై సీబీఐతో ఎందుకు దర్యాప్తు చేయడం లేదని ప్రశ్నించారు. రెండు నెలల కిందట కూడా ఈ అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లిన సంగతిని గుర్తు చేశారు.
‘రెండు నెలల కిందటే ఈ విషయంపై సీబీఐ దర్యాప్తు కోసం నేను మీకు సిఫార్సు చేశాను. కానీ బీజేపీ హయాంలో జరిగిన ఇంత పెద్ద కుంభకోణంపై సీబీఐ విచారణను పక్కన పెట్టారు. నేను రాసిన లేఖను పరిగణించకపోవడం చాలా బాధగా ఉంది’ అని ఎల్జీకి రాసిన లేఖలో సిసోడియా పేర్కొన్నారు. ‘మీ ముందు చాలా వాస్తవాలు ఉన్నప్పటికీ ఇందులో అవినీతిని మీరు చూడలేరు. ఎందుకంటే ఈ అవినీతి బీజేపీ చేసింది’ అని విమర్శించారు. అదే సమయంలో తమ ప్రభుత్వంపై పలు దర్యాప్తులకు ఎల్జీ ఆదేశించడంపై సిసోడియా మండిపడ్డారు.