SIR Voter Roll : కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) చేపట్టిన ‘సర్’ ద్వారా దేశవ్యాప్తంగా ఓట్ల తొలగింపు, గుర్తింపు ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ‘సర్’ అంశానికి సంబంధించి ఇప్పటివరకు వెల్లడైన డాటా ప్రకారం.. దేశవ్యాప్తంగా 13.37 కోట్ల ఓట్లను ఈసీఐ తొలగించింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అన్నిచోట్లా కలిపి 13 కోట్ల మంది పేర్లను ఓటర్ జాబితానుంచి ఈసీఐ తొలగించింది. ఇది మొత్తం 14.1 శాతం ఓట్లకు సమానం.
‘సర్’ ప్రక్రియకు సంబంధించిన కీలక వివరాలివి. మొదట బిహార్‌లో ప్రారంభమైన సర్ ప్రక్రియ ఇప్పటివరకు మూడు దశల్లో కొనసాగింది. మహారాష్ట్రలో అత్యధికంగా 2.07 కోట్ల ఓట్లను తొలగించింది. ఆ తర్వాత కర్ణాటకలో 1.08 కోట్ల ఓట్లు తొలగిపోయాయి. ఆ తర్వాత ఎక్కువ ఓట్లు తొలగిపోయిన మూడో రాష్ట్రం తెలంగాణ. ఇక్కడ ఏకంగా 73.39 లక్షల ఓట్లు తొలగిపోయాయి. ఓటర్ల శాతం పరంగా చూస్తే ఢిల్లీలో అత్యధికంగా 32.8 శాతం ఓట్లు తొలగిపోయాయి. ఢిల్లీలో 47.57 లక్షల ఓట్లు, తర్వాత ఏపీలో 44.90 లక్షల ఓట్లు తొలగిపోయాయి.
అయితే, ఇది తుది జాబితా కాదు. డ్రాఫ్ట్ మాత్రమే. ప్రస్తుతం ఈ జాబితాలో ఓట్లు గల్లంతైన వారు తగిన డాక్యమెంట్లతో సంబంధిత అధికారులను సంప్రదించాలి. వాటిని పరిశీలించిన అనంతరం అర్హులైన వారి పేరును ఓటర్ల జాబితాలో చేరుస్తారు. అలా, పేర్లు గల్లంతైన వారు తమ అభ్యంతరాలు తెలుపుతూ సమీక్ష కోరే అవకాశం ఉంది. ఇవన్నీ పూర్తైన తర్వాత దేశవ్యాప్తంగా పూర్తిస్థాయి ఓటర్ల జాబితా వెలువడుతుంది. ఓటరు జాబితాలో మీ పేరు ఉందో, లేదో తెలుసుకోవాలనుకుంటే voters.eci.gov.in ను సంప్రదించాలి.
లేదా వోటర్ హెల్ప్‌లైన్ యాప్‌లో కూడా చెక్ చేసుకోవచ్చు. పూర్తిగా జాబితా నుంచి పేరు గల్లంతైతే ఫాం 6, జాబితాలో పేరు ఉంచడానికి లేదా తొలగించడానికి తగిన అభ్యంతరాలపై ఫాం 7, జాబితాలో పేరుండి వివరాలు తప్పుగా ఉంటే ఫాం 8 దరఖాస్తు నింపాల్సి ఉంటుంది. అవసరమైతే బూత్ లెవల్ ఆఫీసర్‌ను కూడా సంప్రదించవచ్చు.