PM Modi : వచ్చే ఏడాది పశ్చిమబెంగాల్ (West Bengal) లో అసెంబ్లీ ఎన్నికలు (Assembly elections) జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఓటరు జాబితా ‘ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)’ జరుగుతోంది. దాంతో ఎస్ఐఆర్ నిర్వహణపై బెంగాల్‌కు చెందిన బీజేపీ ఎంపీల (BJP MPs) కు ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) కీలక సూచనలు చేశారు. ఆ ప్రక్రియ సరళంగా, పారదర్శకంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు.
అర్హత ఉన్న ఓటర్లను చేర్చడం, అర్హతలేని వారిని తొలగించడమే ఎస్ఐఆర్ ఉద్దేశమని, ఇదే సందేశం క్షేత్రస్థాయికి చేరేలా చూసుకోవాలని ఎంపీలను ప్రధాని ఆదేశించారు. ఈ మేరకు ప్రధాని మోదీ సన్నిహితవర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా కథనాలు ప్రచురితమయ్యాయి. అదేవిధంగా 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు పూర్తిస్థాయిలో సంసిద్ధంగా ఉండాలని ఎంపీలకు మోదీ సూచించారు.
తృణమూల్ కాంగ్రెస్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్లను ప్రస్తావించకుండానే విపక్షాల ట్రాప్‌లో పడవద్దని ఎంపీలను హెచ్చరించారు. అదేవిధంగా ఆ రాష్ట్రంలో బీజేపీ ఎదిగిన తీరును ప్రస్తావించారు. 2011లో అసెంబ్లీలో ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారని, 2021లో ఆ సంఖ్య 65కు చేరిందని చెప్పారు. స్థానిక అంశాలపై ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలని ఎంపీలను కోరారు. కాగా కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తోన్న ఎస్ఐఆర్ను విపక్షాలు తొలి నుంచి వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మోదీ స్పందించడం ప్రాధాన్యం సంతరించుకుంది.