న్యూఢిల్లీ, నవంబర్ 26: న్యాయాన్ని వెతుక్కుంటూ పౌరులు కోర్టులకు రావడానికి బదులుగా న్యాయస్థానాలే పౌరుల వద్దకు వెళ్లేలా మార్పులు జరుగాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆకాంక్షించారు. న్యాయాన్ని పొందడానికి ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించడానికి సంస్థాగత సంస్కరణలతో సాంకేతికతను మరింత పెంపొందించాలని చెప్పారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం సుప్రీంకోర్టులో జరిగిన కార్యక్రమంలో సీజేఐ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ అందించాలన్న రాజ్యాంగ దార్శనికతపై దేశంలో న్యాయమూర్తులందరూ దృష్టి సారించాలని కోరారు. న్యాయవ్యవస్థలోని ఉద్యోగాలలో అణగారిన వర్గాలు, మహిళల ప్రాతినిధ్యాన్ని మరింత పెంచాలని చెప్పారు. కోర్టులు ప్రజల వద్దకు చేరువయ్యేందుకు వీలుగా లిటిగేషన్ ప్రక్రియను సులభతరం చేయాలని సూచించారు. కొవిడ్ సందర్భంగా కోర్టులు సాంకేతికతపై ఆధారపడ్డాయని, ఇప్పుడు ఆ ప్రక్రియను నిర్విర్యీం చేయకుండా మరింత బలోపేతం చేయాలని చెప్పారు.
ప్రాథమిక విధులే పౌరులకు ముఖ్యం: ప్రధాని మోదీ
దేశాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చేందుకు పౌరులు ప్రాథమిక విధులను నిర్వర్తించడాన్ని తమ ప్రథమ ప్రాధాన్యంగా ఎంచుకోవాలని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. దేశంలో ఆర్థిక వృద్ధి, అభివృద్ధి అత్యంత వేగంగా సాగుతున్న నేపథ్యంలో ప్రపంచం భారత్‌వైపు చూస్తున్నదని చెప్పారు. వచ్చేవారం జీ-20 దేశాల కూటమికి భారత్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నదని తెలిపారు. దీంతో ప్రపంచానికి మనవంతు సాయం చేసే అవకాశం లభించనున్నదని చెప్పారు. ప్రజాస్వామ్యానికి తల్లిగా భారత్ తన గుర్తింపును మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.