డెహ్రాడూన్: స్థానిక వ్యాపారులు, సిక్కు యాత్రికుల మధ్య వివాదం చెలరేగింది. ఇది ఘర్షణగా మారడంతో కత్తులు ధరించిన నిహంగ్ సిక్కులు చెలరేగిపోయారు. కత్తులతో వారు దాడి చేయడంతో నలుగురు గాయపడ్డారు. (Sikh pilgrims, locals clash) ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జూన్ 15న హేమకుండ్ సాహిబ్‌ను దర్శించుకున్న కొందరు నిహంగ్ సిక్కు యాత్రికులకు కర్ణప్రయాగ్‌లో స్థానిక వ్యాపారుల మధ్య చిన్నపాటి వివాదం చెలరేగింది. స్థానిక నివాసి ప్రకాష్ రావత్‌పై నిహంగ్ సిక్కులు పదునైన కత్తులతో దాడి చేశారు. గొడవ ఆపడానికి జోక్యం చేసుకున్న నివాసితులపై మరో ఇద్దరు సిక్కు నిహంగులు కత్తులతో దాడి చేశారు.
కాగా, ఈ సంఘటనలో నలుగురు స్థానికులు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిలో ఒకరిని చికిత్స కోసం డెహ్రాడూన్‌కు హెలికాప్టర్లో తరలించినట్లు చెప్పారు. ముగ్గురి పరిస్థితి నిలకడగా ఉన్నదని వివరించారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
మరోవైపు ఈ సంఘటనపై స్థానిక నివాసితులు, వ్యాపారులు తీవ్ర ఆగ్రహం చెందారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బద్రీనాథ్ హైవేను దిగ్బంధించి నిరసన చేపట్టారు. పంచపులియా వద్ద ట్రాఫిక్‌ను అడ్డుకున్నారు. దీంతో వేలాది మంది యాత్రికులు హైవేకు ఇరువైపులా చిక్కుకుపోయారు.
కాగా, చమోలీ జిల్లా మేజిస్ట్రేట్, ఎస్పీ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్థానికులకు హామీ ఇచ్చారు. దీంతో నిరసనకారులు తమ నిరసన విరమించారు. ఆ తర్వాత బద్రీనాథ్ హైవేపై ట్రాఫిక్‌ను పోలీసులు పునరుద్ధరించారు.