చండీఘఢ్ : రాజకీయంగా నిన్న మొన్నటి వరకూ కత్తులు దూసిన వారిద్దరూ దిగ్గజ నేతలే కాదు..ఒకప్పుడు కమెడియన్లుగా పంజాబీలను హాస్యపు జల్లుల్లో ముంచినవారు. నవ్వులు పూయించే ఈ నేతల కలయికను గ్రేట్ కమెడియన్ల రీయూనియన్‌గా చెబుతున్నారు.
పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌తో కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ సోమవారం సమావేశమయ్యారు. సమావేశం అనంతరం మాన్‌పై సిద్ధూ ప్రశంసలు గుప్పించారు. మాన్ తనను సాదరంగా ఆహ్వానించారని ఆయన ఎంత ఎదిగినా ఒద్దికగా ఉన్నారని మాజీ క్రికెటర్ వ్యాఖ్యానించారు.
తాను ఓ సీఎంను కలిశాననే భావన కలగలేదని మాన్ ఎలాంటి భేషజం లేకుండా ఒదిగి ఉన్నారని అన్నారు. పంజాబ్‌లో ప్రభుత్వ భూముల ఆక్రమణలను సీఎం మాన్ తొలగించారని, ఆయన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని మాన్‌ను ప్రశంసించారు.