అమృత్సర్: పంజాబ్ కాంగ్రెస్‌లో నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ (Navjot singh sidhu) కథ ముగిసిందా.. పార్టీ అతడిని పక్కకు పెట్టేసిందా? ప్రస్తుత పరిస్థితులు చూస్తే అలానే కన్పిస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత పీసీసీ అధ్యక్ష పదవి నుంచి సిధును పార్టీ అధిష్ఠానం తొలగించిన విషయం తెలిసిందే. నూతన అధ్యక్షుడిగా అమరిందర్ సింగ్ రాజాను నియమించింది. ఆయన ఈ రోజు పార్టీ సీనియర్ నాయకులు, ఎంపీల సమక్షంలో బాధ్యలు స్వీకరించారు. పార్టీ పరిశీలకుడు హరీశ్ చౌదరి ఆయనను అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టారు. అయితే ఈ కార్యక్రమంలో సిద్ధు ఎక్కడా కనిపించలేదు. ఆఫీస్‌లోనే ఉన్నప్పటికీ ఈ కార్యక్రమంలో పాల్గొనకపోవడం విశేషం.
బాధ్యల స్వీకార కార్యక్రమానికి రావాలని సిద్ధూని.. రాజా స్వయంగా ఆహ్వానించారు. దీంతో సిద్ధూ పార్టీ ఆఫీస్‌కు వచ్చినప్పటికీ తన గదికే పరిమితమయ్యారు. నూతన అధ్యక్షుడు బాధ్యతలు స్వీకరించేప్పుడు సీనియర్ నాయకులు, ఎంపీలు ఉన్నప్పటికీ.. సిద్ధూని ఎవ్వరూ పట్టించుకోక పోవడం గమనార్హం.
కాగా, పార్టీ అధిష్ఠానంపై సిద్ధుతోపాటు అతని అనుచరులు ఆగ్రహంగా ఉన్నారు. అధ్యక్ష పదవి నుంచి తప్పించిన తర్వాత పార్టీ బహిష్కృతులతో వ్యక్తిగతంగా సమావేశమవుతున్నారు. కొన్నిసార్లు సమాంతరంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇవన్నీ చూస్తే సిద్ధు ఎంతకాలంపాటు పార్టీలో ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.