బెంగళూరు: మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) భూ కేటాయింపుల కుంభకోణంలో లోకాయుక్త కేసు నమోదు చేయడంపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah) స్పందించారు. మొదటిసారి తనపై రాజకీయ కేసు నమోదైందని తెలిపారు. అయినప్పటికీ సీఎం పదవికి రాజీనామా చేయబోనని స్పష్టం చేశారు. ‘నేనేం తప్పు చేయలేదు. నాపై రాజకీయ కేసు నమోదు కావడం ఇదే తొలిసారి. ఇది రాజకీయ కేసు, దయచేసి అండర్లైన్ చేయండి’ అని మీడియాతో అన్నారు.
కాగా, తన రాజీనామాను డిమాండ్ చేస్తూ బీజేపీ చేస్తున్న నిరసనలపై మీడియా అడిగిన ప్రశ్నకు సిద్ధరామయ్య సమాధానం ఇచ్చారు. ‘నేనెందుకు రాజీనామా చేయాలి? ఎవరైనా తప్పు చేస్తే రాజీనామా చేయాలి, తప్పు చేయలేదని చెబుతున్నప్పుడు, రాజీనామా చేసే ప్రశ్న ఎక్కడ ఉంది?’ అని అన్నారు. ప్రతిపక్షాలు తనను చూసి భయపడుతన్నాయని, అందుకే తనను లక్ష్యంగా చేసుకున్నారని ఆయన ఆరోపించారు.
మరోవైపు సీబీఐ, ఈడీ వంటి కేంద్ర సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని సిద్ధరామయ్య విమర్శించారు. అలాగే దేశవ్యాప్తంగా ప్రతిపక్షాల పాలిత రాష్ట్రాల్లో గవర్నర్ కార్యాలయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. కాగా, సీబీఐ పక్షపాతంగా వ్యవహరిస్తోందని కర్ణాటక ప్రభుత్వం మండిపడింది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని కేసుల దర్యాప్తు కోసం సీబీఐకి ఇచ్చిన సాధారణ సమ్మతిని గురువారం ఉపసంహరించింది.