Yatindra Siddaramaiah | కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుత సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah)ను తప్పించి.. ఆయన స్థానంలో డిప్యూటీ సీఎంగా ఉన్న డీకే శివకుమార్ (DK Shivakumar)ను సీఎంగా కాంగ్రెస్ అదిష్ఠానం నియమించబోతోందని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ ప్రచారం వేళ సీఎం సిద్ధూ కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్య (Yatindra Siddaramaiah) తాజాగా స్పందించారు. ఈ మేరకు కర్ణాటకలో నాయకత్వ మార్పు ఊహాగానాలను తోసిపుచ్చారు. తన తండ్రి ఐదేండ్ల పూర్తి పదవీకాలం సీఎంగా కొనసాగుతారని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా యతీంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సీఎం పదవిని చేపట్టాలని ఆకాంక్షిస్తున్నందున నాయకత్వ మార్పుపై గందరగోళం తలెత్తిందన్నారు. అయితే, పార్టీ హైకమాండ్ మాత్రం ఇప్పటికీ నాయకత్వ మార్పుపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోమని స్పష్టం చేసినట్లు తెలిపారు. ‘సీఎల్పీ సమావేశంలో ఎన్ని సంవత్సరాలు అనే దాని గురించి చర్చించరు. వారు కేవలం సీఎంని మాత్రమే నిర్ణయిస్తారు. ఇప్పుడు రాష్ట్రంలో ఎలాంటి నాయకత్వ మార్పు ఉండదని హైకమాండ్ స్పష్టం చేసింది. సిద్ధరామయ్య ఐదేండ్లు సీఎంగా ఉంటారని నేను స్పష్టం చేయాలనుకుంటున్నా. రాష్ట్రంలో నాయకత్వ మార్పుకు ఎలాంటి కారణం కనిపించడం లేదు’ అని యతీంద్ర అన్నారు.
ఇక యతీంద్ర వ్యాఖ్యలకు డీకే స్పందిస్తూ.. ‘నేను చాలా సంతోషంగా ఉన్నాను. రాష్ట్రానికి మంచి జరగనివ్వండి.. మంచి జరగనివ్వండి’ అని వ్యాఖ్యానించారు. కర్ణాటకలో కాంగ్రెస్ సర్కారు రెండున్నరేళ్ల పాలన పూర్తయిన తర్వాత ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు సీఎం బాధ్యతలు అప్పగించేలా అప్పట్లో ఓ ఒప్పందం కుదిరిందని ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే.
Also Read..
Roof Collapses | పెళ్లి ఇంట విషాదం.. రూఫ్ కూలి 40 మందికి గాయాలు.. VIDEO
IndiGo | తొమ్మిదో రోజుకు చేరిన ఇండిగో సంక్షోభం.. నేడు కూడా వందలాది విమానాలు రద్దు
Actor Vijay | పుదుచ్చేరిలో విజయ్ బహిరంగ సభ.. ర్యాలీలోకి తుపాకీతో చొరబాటుకు వ్యక్తి యత్నం..!