Karnataka | బెంగళూరు: ముడా కుంభకోణంలో పీకల్లోతు కూరుకుపోయి విచారణను ఎదుర్కొంటున్న సీఎం సిద్ధరామయ్య ఏ క్షణంలోనైనా పదవిని కోల్పోతారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. అదే సమయంలో ఆ పీఠాన్ని చేజిక్కించుకోవడానికి కొందరు నేతలు జోరుగా ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే ముడా కేసులో ఈడీ, లోకాయుక్త పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశాయి.
ఎస్సీ వర్గానికి చెందిన సీనియర్ మంత్రులు పరమేశ్వర, మహదేవప్ప, ఎస్టీ వర్గానికి చెందిన సతీశ్ జార్ఖిహోళి ఇటీవల కలుసుకోవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. అంతకుముందు డిప్యూటీ సీఎం శివకుమార్ కూడా పరమేశ్వర, జార్ఖిహోళితో విడివిడిగా సమావేశమై మంతనాలు జరిపారు. ఒక వేళ కాంగ్రెస్ అధిష్ఠానం కనుక సిద్ధరామయ్యను మార్చాలనుకుంటే పరమేశ్వర, శివకుమార్ ఆ పదవికి పోటీపడేవారిలో ముందువరుసలో ఉంటారని ఒక సీనియర్ నేత తెలిపారు. కాగా, ఇప్పటికే పార్టీలోని ఆర్వీ దేశ్పాండే, ఎంబీ పాటిల్ లాంటి నేతలు సిద్ధరామయ్యపై బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తూ తాము ఆ పదవికి పోటీలో ఉన్నామంటూ ప్రకటించారు.
ప్రతి ఒక్కరూ సీఎం పదవిని కోరుకుంటారని, అందులో తప్పు లేదని, అధిష్ఠానం సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిని చేసింది కాబట్టి ఆయన ఆ పదవిలో ఉన్నారని పార్టీ సీనియర్ నేత, మాజీ సీఎం వీరప్ప మొయిలీ శుక్రవారం పేర్కొన్నారు. ఆయన ఐదేండ్లు సీఎంగా కొనసాగుతారా అన్నది అధిష్ఠానం ఇష్టమని, సిద్ధరామయ్య దిగిపోవాలంటూ పార్టీ నుంచి ఎలాంటి ఒత్తడి లేదని ఆయన అన్నారు. కాగా, 2028 అసెంబ్లీ ఎన్నికల్లోనే తాను సీఎం పదవికి పోటీ పడతానని జార్ఖిహోళి గతంలో ప్రకటించారు.
ముడా కుంభకోణంలో సిద్ధరామయ్య పీకల్లోతు కూరుకుపోయినా ఆయనకు అధిష్ఠానం అండగా ఉన్నదన్న ప్రచారం జరుగుతున్నది. తమను అధికారం లోంచి దించేయడానికే కేంద్రంలోని బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థలను, గవర్నర్ వ్యవస్థలను పావుగా వినియోగించుకుంటున్నదని, బీజేపీ ఎత్తులకు బ్రేక్ వేయాలంటే సిద్ధూనే సీఎంగా కొనసాగించాలని అధిష్ఠానం భావిస్తున్నట్టు ఆ వర్గాలు తెలిపాయి.
ముడా కుంభకోణంలో పూర్తి ఆధారాలతో సిద్ధరామయ్యపై ఆరోపణలు ఉన్నాయని, ఆయన అందులోంచి బయటపడటం దాదాపు అసాధ్యమని పార్టీలోని కొందరు నేతలు పేర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సిద్ధూనే సీఎంగా కొనసాగితే పార్టీ పరువు బజారున పడటం ఖాయమని, ఆయనను మార్చడం తప్ప పార్టీకి మరో ప్రత్యామ్నాయం లేదని వారు అంటున్నారు.