శివమొగ్గ, సెప్టెంబర్ 4: ముడా కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గౌరవంగా పదవికి రాజీనామా చేయాలని మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత యెడియూరప్ప సూచించారు. ఈ కుంభకోణంలో సిద్ధరామయ్యను విచారించేందుకు గవర్నర్ అనుమతి ఇచ్చారు. దీనిని ఆయన కోర్టులో సవాల్ చేశారు. అయితే, కోర్టు తీర్పు ఇవ్వకముందే పదవి నుంచి తప్పుకోవాలని యెడియూరప్ప సూచించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ‘కోర్టు తీర్పు ఇచ్చాక వంద శాతం సిద్ధరామయ్య రాజీనామా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. తీర్పు రాకముందే గౌరవంగా రాజీనామా చేయమని సూచిస్తున్నా. ఆయన ప్రమేయం ఉన్న కుంభకోణాలన్నీ నిరూపితం అయినందున, ఇక తప్పించుకునే అవకాశం లేదు’ అని పేర్కొన్నారు. సిద్ధరామయ్యపై విచారణ జరగకుండా సెప్టెంబర్ 9 వరకు మధ్యంతర స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే.