Siddaramaiah | కర్నాటకలో నాయకత్వ మార్పు ఊహాగానాలు కొనసాగుతూనే ఉన్నాయి. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ రెండు వర్గాలు విడిపోయారు. అయితే, నేతలను మళ్లీ ఒకేతాటిపైకి తీసుకవచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇటీవల డీకే శివకుమార్ సీఎం నివాసానికి అల్పాహారం కోసం వెళ్లి ఈ అంశంపై చర్చించారు. తాజాగా డీకే ఇంటికి సీఎం సిద్ధరామయ్య నివాసానికి వెళ్లబోతున్నారు. డిసెంబర్ 2న మంగళవారం శివకుమార్ ఇంటికి వెళ్లనున్నారు. అయితే, తనకు ఇంకా అధికారిక ఆహ్వానం అందలేదని సీఎం తెలిపారు. శనివారం అల్పాహారం సందర్భంగా సీఎం, డిప్యూటీ సీఎం ఇద్దరూ భేటీ అయ్యారు. అనంతరం ఇద్దరు నేతలు కలిసి పార్టీ శ్రేణులకు ఐక్యతా సందేశం ఇచ్చారు. పార్టీ హైకమాండ్ నిర్ణయమే శిరోధ్యామని స్పష్టం చేశారు. సమాచారం మేరకు.. పార్టీ హైకమాండ్ సిద్ధరామయ్యను ప్రస్తుతానికి రాబోయే అసెంబ్లీ సమావేశాల వరకు సీఎంగా కొనసాగాలని సూచించింది.
ఈ క్రమంలో సిద్ధరామయ్య మాట్లాడుతూ.. డీకే శివకుమార్ తనను మంగళవారం అల్పాహారానికి తన ఇంటికి రావాలని కోరారని.. ఇంకా అధికారిక ఆహ్వానం అందలేదన్నారు. ఆహ్వానిస్తే తాను ఖచ్చితంగా వెళ్తానని.. ఆయన నుంచి ఆహ్వానం వస్తుందని అనుకుంటున్నానన్నారు. సీఎం వ్యాఖ్యలపై డీకే శివకుమార్ స్పందిస్తూ.. ఇది తనకు సీఎంకు మధ్య ఉన్న విషయమని.. తాము అన్నదమ్ముల్లా కలిసి పని చేస్తామన్నారు. ఈ సందర్భంగా సీఎంకు తన ఇంటికి అల్పాహారానికి ఆహ్వానించారు. వాస్తవానికి కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావొస్తుంది. ఇద్దరు నేతలు చెరో రెండున్నరేళ్లు సీఎంగా పని చేసేందుకు ఒప్పందం జరిగిందని ప్రచారం జరుగుతున్నది. ప్రస్తుతం సిద్ధరామయ్య ప్రభుత్వం ఏర్పాటై రెండున్నరేళ్లు అవుతున్న సందర్భంలో నాయకత్వ మార్పు తథ్యమని ప్రచారం జరుగుతున్నది. ఇద్దరు నేతల భేటీ మధ్య సయోధ్య కుదిరిందని.. వివాదానికి తెర పడ్డట్లేనని భావిస్తున్నారు.