కర్ణాటకలో అలవిగాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. వాటిని అమలు చేయలేక ఆపసోపాలు పడుతున్నది. ‘కాదేదీ పన్నులకు అనర్హం..’ అన్నట్టుగా సిద్ధరామయ్య సర్కార్ ప్రవర్తిస్తున్నది. ఇప్పటికే గైడెన్స్ వాల్యూ ట్యాక్స్, అదనపు ఎక్సైజ్ డ్యూటీ, రవాణా వాహనాలపై అదనపు సెస్, ఈవీలపై లైఫ్ టైమ్ ట్యాక్స్‌ను ఇబ్బడిముబ్బడిగా వసూలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. తాజాగా పెట్రోల్, డీజిల్‌పై సేల్స్ ట్యాక్స్‌ను పెంచేసింది. దీంతో ఐదు గ్యారెంటీల అమలుకు అవసరమైన నిధుల కోసం తమ జేబులకు చిల్లు పెట్టడం ఏంటని రాష్ట్ర ప్రజలు హస్తం పార్టీ సర్కార్‌ను నిలదీస్తున్నారు. ‘రేపు మా పరిస్థితి కూడా ఇంతేనా?’ అని తెలంగాణలోని సామాన్యులు ఇప్పుడు దిక్కులు చూసే పరిస్థితి దాపురించింది.
Karnataka | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ): కర్ణాటకలో ఏడాది కిందట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రజలపై పన్నుల వాతను కొనసాగిస్తున్నది. ఐదు హామీల అమలుకు అవసరమైన నిధుల కోసం సామాన్యుల జేబులకు చిల్లు పెడుతున్నది. పెట్రోల్, డీజిల్‌పై సేల్స్ ట్యాక్స్‌ను పెంచుతూ శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. పెట్రోల్‌పై సేల్స్ ట్యాక్స్‌ను 25.92 నుంచి 29.84 శాతానికి (3.92 శాతం పెరుగుదల), డీజిల్‌పై 14.3 శాతం నుంచి 18.4 శాతానికి (4.1 శాతం పెరుగుదల) పెంచింది. దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ.3, లీటర్ డీజిల్ ధర రూ.3.02 మేర పెరిగింది. తాజా పెంపు వెంటనే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో వెల్లడించింది. సేల్స్ ట్యాక్స్ పెంపుతో ఏటా రాష్ట్ర ఖజానాకు రూ.2,500-2,800 కోట్ల మేర ఆదాయం సమకూరుతుందని ఆర్థికశాఖ అధికారి ఒకరు పేర్కొన్నట్టు మనీ కంట్రోల్ న్యూస్ వెబ్సైట్ వెల్లడించింది.
నిరుడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఐదు గ్యారెంటీల ప్రచారంతో ఊదరగొట్టిన కాంగ్రెస్.. ఎట్టకేలకు అధికారంలోకి వచ్చింది. అయితే, ఆ హామీలను అమలు చేయాలంటే రాష్ట్ర ఖజానాపై ఏటా రూ.52 వేల కోట్ల భారం పడుతుంది. దీంతో గ్యారెంటీల అమలుకు అయ్యే వ్యయాన్ని తగ్గించుకోడానికి ఛార్జీల పెంపు, పన్ను వసూళ్లకు సర్కారు తెగబడుతున్నది. ‘ఉచిత విద్యుత్తు’ అంటూ ఊదరగొట్టి ఛార్జీల పెంపునకు తెరతీసింది. మహిళలకు ఆర్థిక భరోసా ఇస్తామన్న ‘గృహలక్ష్మి’ స్కీమ్‌కు కొత్త ఆంక్షలు జోడించింది. ఆడబిడ్డలకు ఉచిత బస్సు సర్వీసులంటూ ఊరించిన ‘శక్తి’ స్కీమ్‌లో వయసు, వృత్తి అంటూ కొత్త పరిమితులు తెచ్చింది. బస్సు సర్వీసులను తగ్గించింది. నిరుద్యోగులకు భృతి కల్పిస్తామన్న ‘యువనిధి’, పేదలకు ఉచిత బియ్యమన్న ‘అన్నభాగ్య’ ఇలా ప్రతీ స్కీమ్‌లోనూ కోతలు విధిస్తున్నది.
ఆరు గ్యారెంటీల పేరిట అలవిగాని హామీలనిచ్చి తెలంగాణలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దీంతో కర్ణాటక మాదిరిగానే హామీల అమలు పేరిట ఇక్కడ కూడా పన్నుల వాతకు రేవంత్ సర్కారు యోచించవచ్చని సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అదే జరిగితే, ఆర్థికంగా తమ పరిస్థితి మరింత దిగజారుతుందని సామాన్యులు భయపడుతున్నారు.