న్యూఢిల్లీ, ఆగస్టు 9: మాజీ ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్‌పై మాజీ కేంద్ర న్యాయ శాఖ మంత్రి, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. లాపతా లేడీస్(హిందీ సినిమా) గురించి తాను విన్నానని, కాని లాపతా(కనిపించకుండా పోయిన) ఉప రాష్ట్రపతి గురించి వినలేదని సిబల్ శనివారం వ్యాఖ్యానించారు. ధన్‌ఖఢ్ ఆరోగ్యం, యోగక్షేమాలపై తమకు ఆందోళనగా ఉందని, కేంద్ర హోం మంత్రి అమిత్ షా దీనిపై ఓ ప్రకటన చేయాలని సిబల్ విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభం రోజు జూలై 21న ఉప రాష్ట్రపతి పదవికి ధన్‌ఖఢ్ రాజీనామా చేశారు. అయితే ఆయన చేత బలవంతంగా రాజీనామా చేయించారని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. ధన్‌ఖఢ్ రాజీనామా చేసి నెలరోజులవుతోందని, రాజీనామా చేసిన తర్వాత నుంచి ఆయన ఆచూకీ తెలియరావడం లేదని సిబల్ తెలిపారు. ఆయన తన అధికారిక నివాసంలో లేరని, రాజీనామా చేసిన తర్వాత మరుసటి రోజున తాను ఆయనకు ఫోన్ చేశానని, అయితే ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారని ఆయన వ్యక్తిగత కార్యదర్శి తనకు ఫోన్లో చెప్పారని సిబల్ వివరించారు. ధన్‌ఖఢ్ ఉపరాష్ట్రపతిగా పని చేశారని, ఆయన పదవీకాలం మొత్తం ఆయన ప్రభుత్వాన్ని బలపరిచారని చెప్పారు.