న్యూఢిల్లీ, జూలై 6 : ఈ20తోపాటు ఈ10 పెట్రోల్ లభ్యతను కొనసాగించాలని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్(సీయామ్) కోరినట్లు మిథనాల్ మిశ్రమంపై 2021 నాటి నీతి ఆయోగ్ రోడ్‌మ్యాప్ పేర్కొంది. తక్కువ ఇథనాల్ ఉన్న ఇంధనాన్ని ఉపసంహరిస్తే ఇప్పటికే భారత రహదారులపై ఉన్న వాహనాలకు అనుకూలత, భద్రత, ఇంధన సామర్థ్యం, డ్రైవబిలిటీకి సంబంధించిన ఆందోళనలు తలెత్తవచ్చని సియామ్ హెచ్చరించింది. భారత్ అధిక ఇథనాల్ మిశ్రమాల వినియోగం వైపు మారుతున్న తరుణంలో 2021లో నీతి ఆయోగ్ రూపొందించిన భారత్‌లో ఇథనాల్ మిశ్రమం కోసం రోడ్‌మ్యాప్ : 2020-25 నివేదికకు సంబంధించి జరిగిన వాటాదారుల సంప్రదింపుల సందర్భంగా సియామ్ ఈ సిఫార్సులను సమర్పించింది.
ఈ ఇంధనం ఇంజిన్‌కు విస్తృత నష్టం కలిగిస్తుందన్న వాదనలను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) తోసిపుచ్చిన తర్వాత ఈ 20 పెట్రోల్‌పై కొత్తగా మొదలైన చర్చల మధ్య ఈ నివేదిక మళ్లీ వెలుగులోకి వచ్చింది. ఈ20 ఇంధనాన్ని ప్రవేశపెట్టిన తర్వాత కూడా ఈ10ను రక్షణ శ్రేణి ఇంధనంగా అందుబాటులో ఉంచాలని సియామ్ వాదించినట్లు నివేదికలోని అనుబంధ డీ విభాగం పేర్కొంది. అధిక ఇథనాల్ మిశ్రమాల వినియోగం వైపు మారుతున్న దేశాలు ఆ మార్పు కాలంలో తక్కువ ఇథనాల్ శాతం ఉన్న ఇంధన ఎంపికలనూ అందుబాటులో ఉంచుతూ వచ్చాయని పరిశ్రమల సంఘం పేర్కొంది.
ఇప్పటికే వాడుకలో ఉన్న అనేక వాహన రకాలు, ఇంధన-వ్యవస్థ కాన్ఫిగరేషన్ల కారణంగా పాత వాహనాలను అధిక ఇథనాల్ మిశ్రయాలపై మెరుగ్గా నడిచేలా రెట్రోఫిట్ చేయడం ఒక పెద్ద సవాలు అవుతుందని సియామ్ వాదించింది. అనేక వాహన వేరియంట్ల కోసం అప్‌గ్రేడ్ చేసిన భాగాలను అభివృద్ధి చేయడం, వినియోగదారులు వాటిని స్వీకరించేలా చూడటం అసాధ్యమైన పనిగా పేర్కొంది. ట్రాయ్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం సంయుక్తంగా నిర్వహించిన ఒక అధ్యయనాన్ని ఈ నివేదిక ఉటంకించింది. దీని ప్రకారం ఈ20 వాడకంతో ఇంజిన్ సామర్థ్యం 6% తగ్గిందని తేలింది.