Shubhanshu Shukla | ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు వెళ్లి చరిత్ర సృష్టించిన గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా సోమవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా తన అంతరిక్షయానం గురించి ప్రధానికి వివరించారు. మోదీ శుక్లాను ఆలింగనం చేసుకొని అభినందించారు. ఆయన సాధించిన విజయాన్ని ప్రశంసించారు. అనంతరం శుక్లా తన అంతరిక్ష ప్రయాణం, అనుభవాలను మోదీకి చెప్పారు. శుక్లా ఆదివారం భారత్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా, ఇస్రో చీఫ్ వీ నారాయణన్ సహా పెద్ద సంఖ్యలో జనం శుభాన్షు శుక్లాకు స్వాగతం తెలిపేందుకు వచ్చారు. శుక్లా భార్య కామ్నా, కుమారుడు కియాష్ సైతం విమానాశ్రయానికి వచ్చారు. దాదాపు ఏడాది తర్వాత శుభాన్షు భారత్‌కు వచ్చాడు. ఐఎస్ఎస్ఐకు వెళ్లేందుకు అమెరికాలోనే దాదాపు ఏడాది పాటు శిక్షణ పొందాడు.
ఆక్సియం-4 మిషన్‌కు బ్యాకప్‌గా ఎంపికైన గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ సైతం శుభాన్షుతో కలిసి స్వదేశానికి చేరుకున్నాడు. శుభాన్సు సోమవారం ప్రధానిని మోదీని కలువగా.. ఆ తర్వాత తన స్వస్థలం లక్నోకు వెళ్లనున్నారు. ఆగస్టు 22-23 తేదీల్లో జరిగే జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి ఢిల్లీకి చేరుకుంటారు. కేంద్ర ప్రభుత్వం సోమవారం లోక్‌సభలో ప్రత్యేక చర్చ చేసింది. శుభాన్షు భారతదేశానికి తిరిగి వచ్చిన సందర్భంగా ఈ చర్చను చేపట్టింది. లోక్‌సభలో జరగనున్న చర్చ సందర్భంగా కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడారు 2047 నాటికి చంద్రుడిపై కాలుమోపి.. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తామన్నారు. ఇదిలా ఉండగా.. ఆక్సియం మిషన్ల భాగంగా శుక్లా జూన్ 235న ఫ్లోరిడా నుంచి బయలుదేరి.. జులై 15న భూమికి తిరిగి వచ్చాడు. మరో ముగ్గురు వ్యోమగాములు పెగ్గీ విట్సన్ (అమెరికా), స్లావోజ్ (పోలాండ్), టిబోర్ కాపు (హంగేరీ)లతో కలిసి 18 రోజుల పాటు ఐఎస్ఎస్లో గడిపారు. మిషన్‌లో శుభాన్షు 60కి పైగా ప్రయోగాలు, 20 ఔట్రీచ్ సెషన్లను నిర్వహించారు.