కోల్కతా: ప్రతిపక్షాల ‘ఇండియా’ బ్లాక్లో భాగమైన నేషనల్ కాన్ఫరెన్స్ నేత, జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా బాటను మరో పార్టీ అనుసరించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎం)పై వస్తున్న ఆరోపణలను తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఖండించింది. ఈవీఎంలపై అనుమానం ఉన్నవారు వాటిని ఎలా హ్యాక్ చేయవచ్చో చూపించాలని టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ (Abhishek Banerjee) సవాల్ చేశారు. ఈవీఎంలపై ప్రశ్నలు లేవనెత్తే వ్యక్తుల వద్ద ఏమైనా సమాచారం ఉంటే ఎన్నికల కమిషన్ (ఈసీ)కు డెమో చూపించాలని అన్నారు.
కాగా, ఈవీఎం ర్యాండమైజేషన్, నమూనా పోలింగ్, కౌంటింగ్ సమయాల్లో సిబ్బంది, పార్టీల ప్రతినిధులు సరిగా పని చేస్తే ఈ ఆరోపణల్లో వాస్తవం ఉందని తాను అనుకోవడం లేదని మమతా బెనర్జీ మేనల్లుడైన అభిషేక్ బెనర్జీ అన్నారు. ‘ఇప్పటికీ ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చని ఎవరైనా భావిస్తే, ఎన్నికల కమిషన్ను వారు కలవాలి. ఈవీఎంలను ఎలా హ్యాక్ చేయవచ్చో చూపించాలి. కేవలం యాదృచ్ఛిక ప్రకటనలు చేయడం ద్వారా ఏమీ చేయలేం’ అని వ్యాఖ్యానించారు.