Supreme Court | కర్నాటక సర్కారు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ ఆదేశాలపై జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. తమిళనాడుకు 5వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ ఇటీవల కర్నాటకను ఆదేశించింది. ఈ నెల 28లోగా తమిళనాడుకు నీరివ్వాలని అథారిటీ ఈ నెల 18న ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, కరువు పరిస్థితుల నేపథ్యంలో ఉత్తర్వులపై కర్నాటక సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. అథారిటీ ఇచ్చిన ఆదేశాలపై జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. ఈ సందర్భంగా ప్రతి 15రోజులకోసారి సమావేశం నిర్వహించాలని కావేరి వాటర్ బోర్డు అథారిటీని ఆదేశించింది. కర్నాటక నుంచి రోజుకు 24వేల క్యూసెక్కులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తమిళనాడు సర్కారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఈ సారి తక్కువ వర్షాపాతం కారణంగా రాష్ట్రం కరువు పరిస్థితులను ఎదుర్కొంటుందని, నీటిని విడుదల చేయలేమని పేర్కొంటున్నది.
కావేరి నదిని ‘పొన్ని’ అని కూడా పిలుస్తుంటారు. ఈ నైరుతి ఇది కర్నాటక పశ్చిమ కనుమలలోని బ్రహ్మగిరి కొండల్లో ఉద్భవించింది. ఈ నది కర్నాటక, తమిళనాడు, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల గుండా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. స్వాతంత్య్రానికి ముందు నుంచి కావేరి జలాల వివాదం కొనసాగుతున్నది. కావేరీ నదీ జలాల వివాదం 1892లో మైసూరు, మద్రాసు ప్రావిన్సుల మధ్య మొదటిసారి తలెత్తింది. ఆ సమయంలో మైసూరు ప్రాంతం రాజుల ఆధీనంలో ఉండగా, మద్రాస్ ప్రావిన్స్ బ్రిటీషర్ల చేతిలో ఉంది. నీటి పారుదల ప్రాజెక్టులను పునరుద్ధరించాలని మైసూర్ భావించగా, అందుకు మద్రాస్ ప్రావిన్స్ విబేధించింది. దీంతో మద్రాస్ ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా కావేరీ నదిపై ప్రాజెక్టులు చేపట్టేలా ఇరు ప్రావిన్సుల మధ్య మధ్య ఒప్పందం కుదిరింది. తర్వాత 1910లో కావేరీ నదిపై కన్నాంబడి గ్రామం వద్ద 41.5 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న ప్రాజెక్టును నిర్మించేందుకు మైసూరు రాజు కృష్ణరాజ ఒడయార్, ప్రముఖ సివిల్ ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వయ్య ప్రణాళికలు రూపొందించారు.
రెండు దశల్లో ఈ ప్రాజెక్టు నిర్మించాలని భావించారు. తొలి దశలో 11 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టు నిర్మించాలని నిర్ణయించారు. రెండో దశ కోసం సిద్ధపడుతున్న తరుణంలో తాము మెట్టూరు డ్యామ్ నిర్మాణం చేపట్టినందున.. రెండో దశ పనులను ఉమ్మడి మద్రాసు అడ్డుకుంది. ఆ తర్వాత భారత ప్రభుత్వ సహకారంతో మైసూరు ఈ ప్రాజెక్టు నిర్మించినప్పటికీ నిల్వ సామర్థ్యం మాత్రం 11 టీఎంసీలకే పరిమితం కావాల్సి వచ్చింది. మైసూరు ఇందుకు అంగీకరించినప్పటికీ.. పాత ప్రణాళిక ప్రకారమే ప్రాజెక్టు నిర్మాణం మొదలుపెట్టగా.. మద్రాసు దీన్ని గురించడంతో వివాదం మొదలైంది. దీంతో 1892 నాటి ఒప్పందం మేరకు మధ్యవర్తిత్వానికి నాటి బ్రిటిష్ ఇండియా సిఫారసు చేసింది. హెచ్డీ గ్రిఫిన్ మధ్యవర్తిగా, ఎం నీథర్సోల్ మదింపుదారుగా నియామకం కాగా.. 1914లో ఆయన మైసూరుకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు. దీంతో 11 టీఎంసీల సామర్థ్యంతో మైసూరు నిర్మించుకునేందుకు మార్గం సుగమమైంది. ఈ విషయం మద్రాసుకు రుచించకపోవడంతో 1924 నాటికి 50 ఏళ్లపాటు వర్తించేలా ఇరు ప్రావిన్సులు ఓ ఒప్పందం కుదుర్చుకున్నాయి.
దేశానికి స్వాతంత్య్రం వచ్చాక 1956లో భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను పునర్విభజించారు. దీంతో మైసూరు, మద్రాసు ప్రావిన్సుల స్థానంలో కావేరీ పరివాహక ప్రాంతంలో కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు ఏర్పటయ్యాయి. పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతమైంది. దీంతో కావేరి ప్రధాన ఉపనదుల్లో ఒకటైన కాబిని జన్మస్థలం కేరళ కావడంతో కావేరీ జలాల్లో ఆ రాష్ట్రానికి కూడా వాటా దక్కింది. గతంలో జరిగిన ఒప్పందాల ప్రకారం ఏదైనా ప్రాజెక్టు నిర్మాణం చేపడితే ఎగువ, దిగువ రాష్ట్రాల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, 1974లో తమిళనాడు అనుమతి లేకుండా కర్నాటక నీటిని మళ్లించేందుకు యత్నించగా.. మరోసారి వివాదం నెలకొంది. ఈ సమస్యల పరిష్కారానికి 1990లో కావేరి జల వివాద ట్రిబ్యునల్ సైతం ఏర్పాటైంది.