దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేకెత్తించిన బీహార్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమికి భారీ షాక్ తగిలింది. ఆర్జేడీ, కాంగ్రెస్, పలు ఇతర పార్టీలతో కూడిన మహాఘట్బంధన్ ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయింది. మొత్తం 243 స్థానాలకు గాను కాంగ్రెస్ సారథ్య కూటమి 35ను మించి గెలవలేక చతికిలపడింది.
ఢిల్లీ/పాట్నా: జేడీయూ అధినేత, ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ సారథ్యంలోని ఎన్డీయే కూటమి మళ్లీ విజయం సాధించింది. బీహార్‌లోని మొత్తం 243 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే మూడింట రెండొంతుల స్థానాలను గెలుచుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు 122 స్థానాలు అవసరం కాగా, ఎన్డీయే 202 స్థానాలను కైవసం చేసుకుంది. చెరో 101 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ, జేడీయూ వరుసగా 89,85 స్థానాలను గెలుచుకున్నాయి. కూటమిలో భాగస్వామిగా ఉన్న చిరాగ్ పాశ్వాన్ సారథ్యంలోని ఎల్జేపీ 19 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ సారథ్యంలోని మహాఘట్బంధన్ 35 స్థానాలకే పరిమితమైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించిన ఆర్జేడీ ఈసారి 25 సీట్లకి పడిపోగా, 61 స్థానాలలోపోటీచేసిన కాంగ్రెస్ కేవలం ఆరు స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి బరిలోకి దిగిన మాజీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌కిశోర్ నేతృత్వంలోని జన్ సురాజ్ పార్టీ ఖాతా కూడా తెరవలేకపోయింది.

తాజా ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 55.6 శాతం ఓట్లు రాగా, మహాఘట్బంధన్కు 35 శాతం ఓట్లు వచ్చాయి. జన్‌సురాజ్ కేవలం 0.3 శాతం ఓట్లను మాత్రమే సాధించగలిగింది. కాగా, సీట్లను భారీగా కోల్పోయినప్పటికీ ఆర్జేడీ.. బీజేపీ, జేడీయూ కంటే అత్యధిక ఓట్లను సాధించడం విశేషం. ఆ పార్టీకి దాదాపు 22.9 శాతం ఓట్లు రాగా, బీజేపీకి 20 శాతం, జేడీయూకి 19.2 శాతం ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో ఆర్జేడీ స్థిరమైన ఓట్ల శాతం సాధించినప్పటికీ, సీట్లను మాత్రం భారీగా కోల్పోయింది. 2005లో 75, 2010లో 22, 2015లో 80, 2020లో 75 స్థానాల్లో విజయం సాధించగా ఈ సారి 25 సీట్లకే పరిమితం అయింది. 2010 తర్వాత ఈ స్థాయిలో సీట్లు కోల్పోవడం ఇదే తొలిసారి. మహాఘట్బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి అయిన ఆర్జేడీ అగ్రనేత తేజస్వీయాదవ్ కూడా పార్టీకి కంచుకోట అయిన రాఘోపూర్‌లో అత్యంత కష్టం మీద గెలుపొందారు.
ఎన్నికల వ్యూహకర్తగా దేశవ్యాప్తంగా తనదైన ముద్ర వేసిన జన్‌సురాజ్ అధినేత ప్రశాంత్ కిషోర్, సొంత రాష్ట్రంలో మాత్రం బోణీ కూడా కొట్టలేక చతికిలపడ్డారు. చాలా చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు మూడోస్థానానికి పరిమితమయ్యారు. సంస్థాగతంగా బలంగా లేకపోకడం, పార్టీకి బలమైన అభ్యర్థులు లేకపోవడం, కొన్ని అభ్యర్థుల తిరుగుబాట్లు, చివరిక్షణంలో నేతలు పార్టీ మారడం జన్‌సురాజ్‌ను దెబ్బతీశాయి.
మహువాలో లాలూ పెద్ద కుమారుడి
ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు, జనశక్తి దళ్ చీఫ్ తేజ్ ప్రతాప్ యాదవ్ బీహార్‌లోని మహువా అసెంబ్లీ సీట్లో మూడో స్థానానికి దిగజారారు. ఇక్కడ ఎల్జేపీ (ఆర్వీ) అభ్యర్థి సంజయ్ కుమార్ సింగ్, ఆర్జేడీ అభ్యర్థి ముఖేష్ కుమార్ రౌషన్పై 44,997 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో తేజ్ ప్రతాప్ 35,703 ఓట్లుతో మూడో స్థానంలో నిలిచారు. సింగ్‌కు 87,641, రౌషన్కు 42,644 ఓట్లు వచ్చాయి. ఒక మహిళతో తనకు ఉన్న సంబంధం గురించి ఈ ఏడాది మే 25న తేజ్ ప్రతాప్ సామాజిక మాధ్యమంలో వెల్లడించడంతో అతడిని ఆర్జేడీ నుంచి బహిష్కరిస్తూ లాలూ ప్రసాద్ యాదవ్ వేటు వేశారు. తర్వాత తేజ్ ప్రతాప్ ఇటీవలే కొత్త పార్టీని స్థాపించారు.
బీహార్ శాసనసభ ఎన్నికల్లో ఏఐఎంఐఎం 5 స్థానాల్లో విజయం సాధించింది. అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఈ పార్టీకి ముస్లింలు అధికంగా గల సీమాంచల్‌లో ప్రాబల్యం ఉంది. మొత్తం 243 స్థానాలు గల ఈ రాష్ట్రంలో ఏఐఎంఐఎం 29 స్థానాల్లో పోటీ చేసింది. వీటిలో 24 స్థానాలు సీమాంచల్ ప్రాంతంలో ఉన్నాయి. ఈ పార్టీ అభ్యర్థులు అక్తరుల్ ఇమాన్, మహమ్మద్ సర్వర్ ఆలం, గులాం సర్వర్, మహమ్మద్ ముర్షీద్ ఆలం, మహమ్మద్ తౌసీఫ్ ఆలం విజేతలుగా నిలిచారు. ఈ పార్టీ స్వతంత్రంగా పోటీ చేసింది. ఏ కూటమిలోనూ భాగస్వామి కాదు. ఒవైసీ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, బీహార్ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారన్నారు. సీమాంచల్‌ను అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని చెప్పారు.

