బెంగళూరు: మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు హైకోర్టు మంగళవారం గట్టి షాక్ ఇచ్చింది. ఆయన సతీమణికి 14 స్థలాల కేటాయింపులో అక్రమాలు జరిగినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆయనపై దర్యాప్తు జరిపేందుకు గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ఇచ్చిన అనుమతిని సిద్ధరామయ్య సవాల్ చేశారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది. పిటిషన్లో వివరించిన అంశాలపై నిస్సందేహంగా దర్యాప్తు అవసరమని తెలిపింది. స్థలాల లబ్ధిదారు పిటిషనర్ కుటుంబ సభ్యురాలేనని గుర్తు చేసింది. ఈ కేసులో విచారణను నిలుపుదల చేయాలని ప్రజా ప్రతినిధుల కోర్టుకు గత నెల 19న జారీ చేసిన తాత్కాలిక ఆదేశాలను మంగళవారం రద్దు చేసింది.
హైకోర్టు తీర్పుపై సిద్ధరామయ్య స్పందిస్తూ, తాను స్థలాల కేటాయింపు కేసులో దర్యాప్తును ఎదుర్కొనేందుకు సందేహించబోనన్నారు. అయితే, ఇటువంటి దర్యాప్తునకు చట్టం అనుమతిస్తుందా? లేదా? అనే అంశంపై న్యాయ నిపుణులతో చర్చిస్తానని చెప్పారు. తనకు రాజ్యాంగం, చట్టాలపై నమ్మకం ఉందని, అంతిమంగా సత్యమే విజయం సాధిస్తుందని తెలిపారు. బీజేపీ, జేడీఎస్‌ల ప్రతీకార రాజకీయాలకు వ్యతిరేకంగా న్యాయ పోరాటం కొనసాగుతుందన్నారు.
హైకోర్టు తీర్పు నేపథ్యంలో సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. ముడా కేసులో స్వతంత్ర, స్వేచ్ఛాయుత దర్యాప్తునకు మార్గం సుగమం చేయాలని కోరింది. బీజేపీ నేత రాజీవ్ చంద్రశేఖర్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, గవర్నర్ ఆదేశాలను హైకోర్టు సమర్థించిందన్నారు.