న్యూఢిల్లీ: అస్సాంలో అధికార బీజేపీకి గట్టి షాక్ తగిలింది. 2026లో జరగనున్న రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తున్న బోడోలాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ (బీటీసీ) ఎన్నికల్లో కమలం పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. 40 స్థానాలకు గానూ ఆ పార్టీ కేవలం ఐదు స్థానాల్లోనే గెలుపొందింది. ది బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (బీపీఎఫ్) 28 స్థానాల్లో గెలుపొంది అధికారం చేజిక్కించుకుంది. ఇప్పటివరకు బీజేపీ, యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ (యూపీపీఎల్) కలిసి కౌన్సిల్ పాలనా పగ్గాలు చేపట్టాయి. తాజా ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసిన బీజేపీ.. అతిపెద్ద పార్టీగా లేదా కింగ్‌మేకర్‌గా నిలవాలని భావించింది. అయితే ఆ పార్టీ ఆశలపై ప్రజలు చావుదెబ్బ కొట్టారు. 2020లో జరిగిన బీటీసీ ఎన్నికల్లో బీపీఎఫ్‌కు 17 స్థానాలు రాగా, యూపీపీఎల్ 12, బీజేపీ 9 స్థానాల్లో గెలుపొందాయి.
ఎన్నికల తర్వాత పొత్తు పెట్టుకున్న యూపీపీఎల్, బీజేపీ అధికారం చేపట్టాయి. తర్వాత యూపీపీఎల్‌తో తెగదెంపులు చేసుకున్న బీజేపీ ఈసారి ఒంటరిగా పోటీచేసింది. సీఎం హిమంత బిశ్వశర్మ విస్తృతంగా ప్రచారం చేసినప్పటికీ పార్టీకి ఘోర పరాజయం ఎదురుకావడం ఆ పార్టీ శ్రేణులకు మింగుడపడటం లేదు. బీటీసీ అనేది రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ కింద ఏర్పాటైన ఒక అటానమస్ కౌన్సిల్. ఇది 2003లో ఏర్పాటైంది. కోక్రాఝర్, చిరంగ్, బక్సా, ఉదల్గురీ, తామూల్పుర్ జిల్లాలు ఈ కౌన్సిల్ పరిధిలోకి వస్తాయి. రాష్ట్రంలో మొత్తం 126 అసెంబ్లీ స్థానాలు ఉండగా, 16 నియోజకవర్గాలు బోడోలాండ్ టెరిటోరియల్ రీజియన్ పరిధిలో ఉన్నాయి. ఇక్కడ బోడో ప్రజల ప్రాబల్యం అధికం.
ఒకప్పుడు అస్సాంలో ఆధిపత్యం చెలాయించిన కాంగ్రెస్‌కు కూడా ఈ ఎన్నికలు గట్టి ఎదురుదెబ్బే. 40 స్థానాల్లోనూ పోటీచేసిన హస్తం పార్టీ కనీసం ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేకపోయింది. అస్సాం పార్టీ చీఫ్‌గా గౌరవ్ గొగోయ్ నియమితులైన తర్వాత జరిగిన తొలి ఎన్నికలు ఇవి. వాస్తవానికి అస్సాంలో అధికారంలో ఉన్న సమయంలోనూ కాంగ్రెస్‌కు ఈ కౌన్సిల్లో పట్టులేదు. ఉదాహరణకు 2015, 2010లో జరిగిన బీటీసీ ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. 2020లో మాత్రం ఒక్క సీటు గెలుపొందింది.