కొచ్చి: కేరళలోని కొచ్చి పోలీసు స్టేషన్లో గత ఏడాది స్టేషన్ హౌజ్ ఆఫీసర్ ఓ ప్రెగ్నెంట్ మహిళ(Pregnant Woman)పై చేయి చేసుకున్నారు. ఆ కేసులో ఆ ఆఫీసర్‌ను సస్పెండ్ చేస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. అలప్పుజాలోని అరూర్ పోలీసు స్టేషన్లో ఎస్‌హెచ్‌వోగా ప్రస్తుతం కేజే ప్రతాప్ చంద్రన్ పనిచేస్తున్నారు. 2024, జూన్ 20వ తేదీన గర్భిణి మహిళపై చేయి చేసుకున్న దృశ్యాలకు చెందిన సీసీటీవీ ఫూటేజ్ తాజాగా వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ ఆఫీసర్‌ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు.
కొచ్చికి చెందిన స్థానిక మహిళ శ్యామొల్ ఎన్జేపై .. ఎర్నాకుళం నార్త్ ఎస్‌హెచ్‌వోగా ఉన్న సమయంలో చంద్రన్ చేయి చేసుకున్నారు. ఓ కేసు విషయంలో ఆమె భర్తను ఆ ఆఫీసర్ కస్టడీలోకి తీసుకున్నారు. ఆ సమయంలో పోలీసు స్టేషన్ వద్ద గందరగోళం నెలకొన్నది. అప్పుడే గర్భిణిగా ఉన్న శ్యామొల్ చెంపపై ఎస్‌హెచ్‌వో కొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ మహిళను పక్కకు తోసివేస్తూ, ఆ తర్వాత చెంపదెబ్బ కొట్టినట్లు సీసీటీవీ ఫూటేజ్‌లో ఉన్నది. ఆమెపై ఓ మహిళ పోలీసు కూడా చేయి చేసుకున్నది.
ఆ పోలీసు ఆఫీసర్‌ను సర్వీస్ నుంచి డిస్మిస్ చేసే వరకు తమ పోరాటం ఆగదు అని ఆ మహిళ పేర్కొన్నది. తన కండ్ల ముందే భర్తను కొట్టబోయారని, ఆ క్షణంలో ఆ ఆఫీసర్‌ను వేడుకునే ప్రయత్నం చేశానని, అప్పుడు నా ఇద్దరు పిల్లలు నాతోనే ఉన్నట్లు ఆ మహిళ చెప్పింది. ఈ ఘటనకు చెందిన సీసీటీవీ ఫూటేజ్ తన వద్ద ఉన్నట్లు ఆమె వెల్లడించింది. మహిళపై ఎస్‌హెచ్‌వో చంద్రన్ దాడి చేసినట్లు అనేక మంది ఆరోపించారు.