Rahul Gandhi : వరుస ఓటముల షాక్‌తో విదేశీ పర్యటనలో కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ తన అసహనం వెళ్లగక్కుతున్నారని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. విదేశీ గడ్డపై సొంత దేశాన్ని విమర్శించడం దేశభక్తి కలిగిన వారు చేయాల్సిన పని కాదని హితవు పలికారు. రాహుల్ ఇప్పుడు ప్రభుత్వాన్నే కాదు ఎన్నికల కమిషన్‌ను కూడా ప్రశ్నిస్తున్నారని పేర్కొన్నారు. శివరాజ్ చౌహాన్ మంగళవారం జార్ఖండ్ రాజధాని రాంచీలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
వరుస ఓటములతో రాహుల్ నిస్తేజానికి గురయ్యారని ఎద్దేవా చేశారు. విపక్ష నేత హుందాగా వ్యవహరించాలని, ఆయన జవాబుదారీతనంతో వ్యవహరించాలని అన్నారు. రాహుల్ భారత్ జోడో యాత్ర చేపట్టినా దేశంతో ఏమాత్రం మమేకం కాలేదని దుయ్యబట్టారు. ఇక జార్ఖండ్‌ను ప్రస్తుత ప్రభుత్వం భ్రష్టుపట్టించిందని ఆరోపించారు. అపార సహజవనరులతో సుసంపన్నమైన రాష్ట్రాన్ని ఈ ప్రభుత్వం లూటీ చేసి విధ్వంసానికి తెగబడిందని విమర్శించారు.
జార్ఖండ్‌లో నేతల నుంచీ గుట్టులుగా పోసిన నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారని అన్నారు. ఐదేండ్లుగా ప్రజల కోసం వారు ఏమీ చేయలేదని, ఇప్పుడు ఎన్నికలు ముంచుకొస్తుండగా హడావిడి చేస్తున్నారని ఆరోపించారు. జార్ఖండ్ పాలకుల తీరును రాష్ట్ర ప్రజలు అర్ధం చేసుకున్నారని, వాస్తవాలను ప్రజల ముందుంచి సోరెన్ సర్కార్‌ను సాగనంపేందుకు బీజేపీ సంసిద్ధంగా ఉందని చెప్పారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి కాషాయ సర్కార్ కొలువుతీరేలా పార్టీ శ్రేణులు పాటుపడుతున్నాయని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు.