ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీలోని శివసేన కార్యాలయానికి సీల్ వేశారు. ఈ కార్యాలయం తమదంటే తమదని రెండు వర్గాలు వాదనకు దిగాయి. ఈ నేపథ్యంలో ఆ కార్యాలయాన్ని మూసివేశారు. దీనికి సంబంధించి ఒక నోటీసును కార్యాలయం డోర్‌కు అంటించారు. శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే బీజేపీ మద్దతుతో అనూహ్యంగా సీఎం అయ్యారు. దీంతో బలాన్ని నిరూపించుకోవాలని గవర్నర్ ఆదేశించడంతో మహారాష్ట్ర అసెంబ్లీ ఆదివారం ప్రత్యేకంగా సమావేశమైంది. తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యే రాహుల్ నార్వేకర్ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. సోమవారం అసెంబ్లీలో షిండే బల నిరూపణ జరుగుతుంది.
కాగా, ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో శివసేన ఉద్ధవ్ వర్గం, షిండే వర్గం ఎమ్మెల్యేలు ఆదివారం అసెంబ్లీకి వచ్చారు. విధాన సభలోని శివసేన కార్యాలయం తమదంటే తమదని ఇరు వర్గాలు వాదించుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆ కార్యాలయానికి సీల్ వేశారు. ఈ మేరకు అక్కడ నోటీస్ అంటించారు.
39 మంది శివసేన రెబల్ ఎమ్మెల్యేలు, 11 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు కలిపి 50 మంది ఎమ్మెల్యేల మద్దతు తనకు ఉందని తిరుగుబాటు తొలి నుంచి ఏక్నాథ్ షిండే అంటున్నారు. తాము శివసేనను వీడలేదని, బాలాసాహెబ్ సిద్ధంతం మేరకు బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు షిండే వర్గం పేర్కొంది. శివసేనకు చెందిన మెజార్టీ ఎమ్మెల్యేలు తమతోనే ఉన్నారని, తామే అసలు శివసేన అని వాదిస్తున్నది.
మరోవైపు ఎమ్మెల్యేల సంఖ్య ఉన్నంత మాత్రాన అసలు శివసేనగా చెప్పుకోలేరని, పార్టీపై పెత్తనం, ఎన్నికల గుర్తు రెబల్స్‌కు దక్కబోవని శివసేన ఎంపీ సంజయ్ రౌత్, ఆ పార్టీ నేత కిశోర్ తివారీ తెలిపారు. పార్టీ నుంచి బయటకు వెళ్లి పార్టీని సొంతం చేసుకోవడం అంత సులువు కాదని అన్నారు. అసలు శివసేనగా పేర్కొనేందుకు చట్టపరమైన అంశాలు చాలా ఉన్నాయని చెప్పారు.