ముంబై, జూలై 7: పుణెలో మైనర్ బాలుడు తాగిన మైకంలో పోర్సే కారు నడిపి ఇద్దరు యువ ఐటీ ఇంజనీర్లను పొట్టనబెట్టుకున్న ఘటన మరువక ముందే అలాంటిదే మరోటి మహారాష్ట్రలో చోటు చేసుకుంది. పూటుగా మద్యం సేవించిన పాల్ఘడ్ జిల్లాకు చెందిన శివసేన(ఏక్నాథ్ షిండే వర్గం) నేత రాజేష్ షా కుమారుడు మిహిర్ షా (24) మత్తులో కారు నడుపుతూ వర్లీ ప్రాంతంలో స్కూటర్‌పై వెళ్తున్న దంపతులను ఢీ కొట్టాడు. ఈ ఘటనలో మహిళ మృతి చెందగా, ఆమె భర్త గాయపడ్డాడు.
మత్స్సకార వృత్తి చేసుకునే ప్రదీప్, అతని భార్య కావేరి నఖ్వా (45) ఆదివారం తెల్లవారుజామున అనిబిసెంట్ రోడ్లో వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాద సమయంలో మిహిర్ షా పక్కన అతని డ్రైవర్ కూడా ఉన్నాడు. ప్రమాదం జరిగిన తర్వాత వారు అక్కడి నుంచి పరారయ్యారు. కారుపై ఉన్న పార్టీ స్టిక్కర్ చించివేసి, నెంబర్ ప్లేట్ తొలగించి ఆధారాలు చెరిపివేయడానికి ప్రయత్నించారు. అయితే కారు రాజేష్ షా పేరుతో ఉండటంతో పోలీసులు సాయంత్రం అతడిని అరెస్ట్ చేశారు. అలాగే డ్రైవర్‌ను కూడా అరెస్ట్ చేశారు. కాగా, మిహిర్ షా శనివారం రాత్రి తన మిత్రులతో కలిసి జుహూలోని వాయిస్ గ్లోబల్ తపస్ బార్లో మద్యం సేవించినట్టు వెల్లడైంది.
చట్టం అందరికీ సమానమే: సీఎం షిండే
శివసేన నేత కుమారుడైనంత మాత్రాన నిందితుడికి ప్రత్యేక మినహాయింపులేవీ ఉండవని, నేరం చేస్తే చట్టప్రకారం అతడు శిక్షార్హుడేనని మహారాష్ట్ర సీఎం షిండే స్పష్టం చేశారు.