రాంచి, ఆగస్టు 4 : జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) వ్యవస్థాపకుడు, సీనియర్ గిరిజన నేత, జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన శిబూ సొరేన్ కన్నుమూశారు. ఆయన వయసు 81 సంవత్సరాలు. కిడ్నీ సంబంధిత సమస్యలతో ఢిల్లీలోని ఓ దవాఖానలో నెల రోజులుగా చికిత్స పొందుతున్న సొరేన్ సోమవారం ఉదయం చివరిశ్వాస విడిచారు. శిబూ సొరేన్ కుమారుడు, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ ఈ విషయాన్ని వెల్లడిస్తూ ‘గౌరవ డిషోం గురూజీ మనందరినీ వదిలి వెళ్లారు. నేను ఈ రోజు శూన్యంగా మారిపోయాను’ అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. శిబూ సొరేన్‌కు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. భార్య పేరు రూపీ సొరేన్. మాజీ సీఎం గౌరవార్థం జార్ఖండ్ అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేసిన రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజులపాటు సంతాప దినాలుగా ప్రకటించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మొదలు దేశంలోని వివిధ రాజకీయ పార్టీల నేతలు సంతాపాలు ప్రకటించారు. సోమవారం సాయంత్రమే శిబు సొరేన్ భౌతిక కాయాన్ని ఢిల్లీ నుంచి రాంచీ తరలించారు. రామ్‌గఢ్ జిల్లాలోని ఆయన స్వగ్రామానికి భౌతిక కాయాన్ని మంగళవారం తరలించి అక్కడే అంత్యక్రియలు నిర్వహిస్తామని జేఎంఎం పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. జేఎంఎంను స్థాపించిన నాటి నుంచి ఆ పార్టీకి గత 38 ఏండ్లుగా ఆయన నాయకునిగా పనిచేశారు. దేశ రాజకీయాలను మలుపు తిప్పడంలోనూ కీలక పాత్ర పోషించారు. ఆయన నాయకత్వంలోనే గిరిజనుల పోరాటాలు జాతీయ ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
శిబూ సొరేన్ మృతి సామాజిక న్యాయ రంగంలో పెద్ద లోటు అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. ఆయన గిరిజనుల గుర్తింపు కోసం పోరాడారని, జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. గిరిజనులు, పేదలు, అణగారిన వర్గాల సాధికారత పట్ల సొ రేన్ ఎంతో మక్కువ చూపారని ప్రధాని నరేంద్రమోదీ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. అంతకుముందు ప్రధాని దవాఖానకు వెళ్లి సొరేన్ భౌతికకాయం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు.
శిబూ సొరేన్ రామ్‌గఢ్ జిల్లాలోని నెమ్రా గ్రామంలో 1944, జనవరి 11న జన్మించారు. ఆయన జార్ఖండ్ డిషోం గురూ (దేశ నాయకుడు)గా ప్రసిద్ధి చెందారు. ఆయన రాజకీయ జీవితమంతా గిరిజన హక్కుల పోరాటంలోనే సాగింది. ఆయన బాల్యం నుంచి యవ్వనం వరకు సామాజికంగా, ఆర్థికంగా అనేక సమస్యలను ఎదుర్కొన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన 15 ఏండ్ల వయసులో ఉండగా అప్పుల వాళ్లు తన తండ్రి శోబారన్ సొరేన్‌ను హత్య చేశారు. ఆయన రాజకీయాల్లోకి రావడానికి ఈ ఘటన తనపై తీవ్ర ప్రభావం చూపినట్టు చెప్తారు. ఈ నేపథ్యంలోనే 1973లో బెంగాలీ మార్క్సిస్టు నాయకుడు ఏకే రాయ్, కుర్మీ మహతో నాయకుడు బినోద్ బిహారీ మహతోతో కలిసి జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం)ను స్థాపించారు. గిరిజనుల కోసం ఓ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే ధ్యేయంగా జేఎంఎం పనిచేసింది. దశాబ్దాల పోరాటం అనంతరం 2000, నవంబర్ 15న జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడింది. సొరేన్ రాష్ట్ర రాజకీయాలకే పరిమితం కాకుండా దాదాపు 8 సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆయన చివరిసారి 2014-19లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆ తరువాత 2020లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2004లో ఆయన యూపీఏ ప్రభుత్వంలో రెండుసార్లు బొగ్గు శాఖ మంత్రిగా పనిచేశారు. కేంద్ర మంత్రిగా ఉండగానే ఓ ఊచకోత కేసులో అరెస్టయి మూడు నెలల పాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. 2006లో ఓ ఐఏఎస్ అధికారి కిడ్నాప్, హత్య కేసులో దోషిగా తేలారు. ఓ కేంద్రమంత్రి దోషిగా ఖరారవుడం దేశ చరిత్రలో అదే మొదటిసారి. కేంద్రంలో పీవీ నరసింహారావు ప్రభుత్వంపై 1993లో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం సందర్భంగా కాంగ్రెస్, జేఎంఎం మధ్య జరిగిన ముడుపుల లావాదేవీలు తెలిసినందునే ఐఏఎస్ అధికారి శశినాథ్ ఝాను హత్య చేశారని సీబీఐ ఆరోపించింది. అయితే సుప్రీంకోర్టు 2018లో ఆయనను నిర్దోషిగా ప్రకటించింది. ఆయన మూడుసార్లు జార్ఖండ్‌కు సీఎంగా ఎన్నికైనప్పటికీ ఎప్పుడూ పూర్తికాలం పదవిలో కొనసాగలేకపోయారు.