న్యూఢిల్లీ: బంగ్లాదేశ్లో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై ఇవాళ భారత విదేశాంగ మంత్రి జైశంకర్(S.Jaishankar) రాజ్యసభలో ప్రకటన చేశారు. ఫ్లయిట్ క్లియరెన్స్ కోసం హసీనా సర్కారు నుంచి అభ్యర్థన వచ్చినట్లు కేంద్ర మంత్రివెల్లడించారు. బంగ్లాలో శాంతి, భద్రతలు నెలకొనే వరకు ఆందోళన ఉండనున్నట్లు చెప్పారు. గడిచిన 24 గంటల నుంచి ఢాకా అధికారులతో టచ్లో ఉన్నామని, సున్నితమైన అంశాల గురించి చర్చించామన్నారు. బంగ్లాదేశ్లో ఉన్న భారతీయులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆయన చెప్పారు.
భద్రతా దళాల నేతలతో చర్చలు జరిపిన తర్వాతనే బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోందని మంత్రి జైశంకర్ వెల్లడించారు. చాలా తక్కువ సమయంలోనే .. ఇండియాకు వచ్చేందుకు ఆమె రిక్వెస్ట్ చేసినట్లు మంత్రి తెలిపారు. సోమవారం సాయంత్రం ఆమె ఢిల్లీకి చేరుకున్నట్లు చెప్పారు. బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాల గురించి వివరిస్తూ.. అక్కడ జరిగిన హింస, అస్థిరతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. 2024 జనవరి ఎన్నికల నాటి నుంచి బంగ్లాదేశ్లో పరిస్థితి ఆందోళనకంగా ఉందన్నారు. బంగ్లా రాజకీయాల్లో వర్గ పోరు పెరిగిందన్నారు.
జూన్లో విద్యార్థి సంఘాల ఉద్యమం ఊపందుకుందని మంత్రి జైశంకర్ తెలిపారు. రోజు రోజుకూ హింస పెరిగిందని, పబ్లిక్ ఆస్తులను ధ్వంసం చేశారని, జూలై నెలలోనూ హింస కొనసాగినట్లు మంత్రి చెప్పారు.ఈ సమయంలోనే చర్చలు నిర్వహించాలని బంగ్లాను కోరినట్లు ఆయన వెల్లడించారు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా.. ప్రజలు మాత్రం ఆందోళనలు విరమించలేదన్నారు. షేక్ హసీనా వైదొలగాలన్న డిమాండ్ పెరిగిపోయిందన్నారు.
ఆగస్టు 4వ తేదీన ఆందోళనలు మరింత హింసాత్మకంగా మారినట్లు చెప్పారు. పోలీసులు, పోలీసు స్టేషన్లపై దాడులు పెరిగినట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వంతో సంబంధం ఉన్న నేతలకు చెందిన ప్రాపర్టీలను ఆందోళనకారులు నాశనం చేసినట్లు పేర్కొన్నారు. మైనార్టీలకు చెందిన వ్యాపారాలు, ఆలయాలపై కూడా అటాక్ జరిగినట్లు మంత్రి జైశంకర్ తన ప్రకటనలో తెలిపారు.
ఆగస్టు 5వ తేదీన.. కర్ఫ్యూ ఉన్నా.. జనం రోడ్లపైకి వచ్చారు. దీంతో షేక్ హసీనా రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆ క్షణంలోనే తక్కువ సమయంలో ఇండియాకు వచ్చేందుకు హసీనా రిక్వెస్ట్ చేసినట్లు మంత్రి జైశంకర్ చెప్పారు. ఫ్లయిట్ క్లియరెన్స్ కోసం బంగ్లాదేశ్ అధికారుల నుంచి రిక్వెస్ట్ వచ్చినట్లు తెలిపారు.
At very short notice she (Bangladesh PM Sheikh Hasina) requested approval to come for the moment to India. We simultaneously received a request of flight clearance from #Bangladesh authorities. She arrived yesterday evening in Delhi: FAM @DrSJaishankar in #RajyaSabha pic.twitter.com/Ntfad7atzX
— SansadTV (@sansad_tv) August 6, 2024