Jana Nayakudu | కోలీవుడ్‌లో భారీ అంచనాల మధ్య తెరకెక్కిన దళపతి విజయ్ తాజా చిత్రం ‘జన నాయకుడు’ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా జనవరి 9న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అదే సమయంలో ఈ చిత్రంపై సాగుతున్న రీమేక్ ప్రచారానికి ట్రైలర్ ఒక విధంగా కొత్త చర్చకు తెరలేపింది. ‘జన నాయకుడు’ బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ కథకు సమీపంగా ఉందన్న ప్రచారం చాలా కాలంగా వినిపిస్తోంది. ట్రైలర్ విడుదలైన తర్వాత ఆ ప్రచారం మరింత ఊపందుకుంది.
ఆశ్చర్యకరంగా, ఈ చర్చ ప్రభావంతో ‘భగవంత్ కేసరి’ సినిమా మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం దాదాపు రెండేళ్ల తర్వాత టాప్ ట్రెండింగ్ లిస్ట్‌లో మొదటి స్థానానికి చేరింది. ‘జన నాయకుడు’ రిలీజ్ సమయం దగ్గరపడటంతో ప్రేక్షకులు కథా పోలికలను గమనించేందుకు మళ్లీ ఆ సినిమాను చూస్తున్నారని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. రీమేక్ అంశంపై ఇప్పటికే దర్శకుడు హెచ్. వినోద్ స్పందించారు. ఈ ప్రచారాన్ని పూర్తిగా ఖండించలేనని, అలాగే ధ్రువీకరించనంటూ క్లారిటీ ఇచ్చారు. సినిమా చూసిన తర్వాతే ప్రేక్షకులు నిర్ణయానికి రావాలని, అనవసరమైన ఆందోళన అవసరం లేదని తెలిపారు. మరోవైపు ‘భగవంత్ కేసరి’ దర్శకుడు అనిల్ రావిపూడి కూడా ఈ పోలికలపై స్పందిస్తూ, విడుదలైన తర్వాతే అసలు విషయం అర్థమవుతుందని చెప్పారు. విజయ్‌తో తాను పలుమార్లు చర్చించానని, కథలో కొత్తదనం ఉంటుందని సంకేతాలు ఇచ్చారు.
ట్రైలర్‌ను పరిశీలిస్తే తండ్రి–కుమార్తె మధ్య భావోద్వేగాలు, దేశ భద్రతకు సంబంధించిన అంశాలు కీలకంగా కనిపిస్తున్నాయి. ‘భగవంత్ కేసరి’లో బాలయ్య ఒక గార్డియన్ పాత్రలో ఫోబియాతో బాధపడే అమ్మాయిని ధైర్యవంతురాలిగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తారు. అదే తరహాలో ‘జన నాయకుడు’లో విజయ్ పోలీస్ అధికారిగా, ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్న కుమార్తె తండ్రిగా కనిపించడం గమనార్హం. అయితే ఇందులో రాజకీయ నేపథ్యం, దేశానికి ముప్పుగా మారే అంశాలను కలిపి కథను కొత్త దిశగా నడిపినట్టు ట్రైలర్ సూచిస్తోంది. ఈ చిత్రంలో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుండగా, సునీల్, మమితా బైజు, ప్రియమణి, బాబీ డియోల్, గౌతమ్ మీనన్, ప్రకాష్ రాజ్, నరైన్ వంటి బలమైన నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. విజయ్ చివరి సినిమాగా ప్రచారం జరుగుతుండటంతో ‘జన నాయకుడు’పై అభిమానుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి.