ముంబై: మహారాష్ట్రలో 12 ఏళ్ల కిందట కలకలం రేసిన షీనా బోరా (Sheena Bora) హత్య కేసుపై సీబీఐ సంచలన స్టేట్మెంట్ ఇచ్చింది. అటవీ ప్రాంతం నుంచి సేకరించిన ఎముకలు, ఇతర అవశేషాల ప్యాకెట్లు మాయమైనట్లు కోర్టుకు తెలిపింది. అవి ఎక్కడ ఉన్నాయో కనిపించడం లేదని చెప్పింది. రాయగఢ్ అటవీ ప్రాంతంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న ఎముకలు, అవశేషాలు మనిషివేనని సర్ జేజే హాస్పిటల్ ఫోరెన్సిక్ నిపుణుడు డాక్టర్ జెబా ఖాన్ నిర్ధారించారు. ఈ నేపథ్యంలో మే 7న షీనా బోరా హత్య కేసుపై విచారణ సందర్భంగా సాక్షిగా డాక్టర్ ఖాన్‌ను కోర్టుకు పిలిపించారు. హతురాలి అవశేషాలను గుర్తించేందుకు ఆయనకు చూపించాలని సీబీఐని కోర్టు అడిగింది.
కాగా, సీబీఐ తరుఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ సీజే నాండోడే కోర్టుకు హాజరయ్యారు. ఎంత వెతికినప్పటికీ షీనా బోరా ఎముకలు, అవశేషాల ప్యాకెట్లను గుర్తించలేకపోయినట్లు కోర్టుకు తెలిపారు. గురువారం నాటి విచారణలో కూడా సీబీఐ ఈ విషయాన్ని అంగీకరించింది. ఆధారాలైన (ఎముకలు) మార్క్ చేసిన రెండు ప్యాకెట్లు మాయమైనట్లు తెలిపింది. సాక్షికి వాటిని చూపించకుండానే విచారణ కొనసాగించాలని కోర్టును కోరింది.
మరోవైపు తల్లి ఇంద్రాణి ముఖర్జియా, ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా, ఆమె డ్రైవర్ శ్యామ్వర్ రాయ్‌తో కలిసి 2012 ఏప్రిల్ 24 షినా బోరా గొంతు నొక్కి కారులో హత్య చేశారు. మృతదేహాన్ని సూట్‌కేసులో ఉంచి
ఖుర్ద్ ప్రాంతంలో కాల్చివేశారు. రాయగఢ్ అటవీ ప్రాంతంలో అవశేషాలు పడేశారు. నెల తరువాత, కాలిన ఎముకలు, అవశేషాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు.
కాగా, 2015 ఆగస్టులో మరో కేసులో అరెస్టైన కారు డ్రైవర్ శ్యామ్వర్ రాయ్, షీనా బోరా హత్య గురించి పోలీసులకు వెల్లడించాడు. దీంతో ఆమె హత్య సంగతి వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో షీనా తల్లి ఇంద్రాణితో సహా మిగతా నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్నేళ్ల తర్వాత వారంతా బెయిల్‌పై విడుదలయ్యారు.